Friday, April 19, 2024
Friday, April 19, 2024

అజయ్‌ మిశ్రాని తొలగించాల్సిందే

దద్దరిల్లిన యూపీ అసెంబ్లీ
ఏకతాటిపైకి విపక్షాలు

లక్నో : లఖింపూర్‌ ఖేరి హింసపై ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ రెండోరోజు గురువారం కూడా దద్దరిల్లింది. లఖింపూర్‌ హింసకు బాధ్యుడైన కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినదించారు. స్పీకర్‌ పోడియంను చుట్టిముట్టారు. వెల్‌లోకి దూసుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళన జరుగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8,479.53 కోట్ల రెండవ అనుబంధ పొద్దును సభలో ప్రవేశపెట్టింది. 2022`23లోని నాలుగు నెలలకు సంబంధించి రూ.1,68,903.23 కోట్ల ఓటాన్‌ అకౌంట్‌ను యూపీ ఆర్థికమంత్రి సురేశ్‌కుమార్‌ ఖన్నా ప్రవేశపెట్టారు. ఉదయం సభ సమావేశం కాగానే తమ పార్టీ ఎమ్మెల్యే ప్రభు నారాయణ్‌ యాదవ్‌ను పోలీసులు వేధిస్తున్నారని, దీనిపై చర్చించాలని ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌ గోవింద్‌ చౌదరి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పక్ష నేత ఆరాధనా మిశ్రా తమ సభ్యులతో కలిసి వెల్‌లోకి దూసుకెళ్లి అజయ్‌మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ, ఎస్‌బీఎస్‌పీ సభ్యులు కూడా వెల్‌లోకి వెళ్లి నినాదాలు ప్రారంభించారు. లఖింపూర్‌ ఖేరి హింసలో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది మరణించిన విషయం విదితమే. ఈ కేసులో మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు అశీష్‌ మిశ్రా సహా 13మందిని సిట్‌ అరెస్టు చేసింది. ఆందోళనలు కొనసాగడంతో స్పీకర్‌ హృదయ్‌ నరైన్‌ దీక్షిత్‌ సభను దఫదఫాలుగా వాయిదా వేశారు.
అసెంబ్లీ ముందు కాంగ్రెస్‌ ధర్నా
కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాను తక్షణమే కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు ధర్నా చేశారు. లఖింపూర్‌ ఖేరి హింస పథకం ప్రకారమే జరిగినట్లు సిట్‌ నిర్ధారించడంతో అజయ్‌ మిశ్రా మంత్రిగా కొనసాగే అర్హత కోల్పోయారని కాంగ్రెస్‌ నేతలు స్పష్టంచేశారు. ఈ కేసులో కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా ప్రధాన నిందితుడని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ యూపీ అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ లల్లూ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విధానసభ మెట్లపై కూర్చొని ప్లకార్డులు ప్రదర్శించారు. లఖింపూర్‌ ఖేరి కేసు పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని స్పష్టమవుతోందని, రైతులకు న్యాయం జరిగే అవకాశాలు కనిపించడం లేదని లల్లూ ఆరోపించారు. అజయ్‌మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ నేతలు ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీ నిరంతరం డిమాండ్‌ చేస్తున్నారని, లోక్‌సభలో చర్చ చేపట్టాలని రాహుల్‌గాంధీ నిన్న కూడా వాయిదా తీర్మానం ఇచ్చారని, ప్రభుత్వం మాత్రం పారిపోయిందని చెప్పారు. సిట్‌ నివేదిక వచ్చిన తర్వాత కూడా అజయ్‌మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించడానికి ఇబ్బందులేమిటని ఆయన ప్రశ్నించారు. ఆయనను ఎందుకు కాపాడుతోందని నిలదీశారు. జర్నలిస్టులపై అజయ్‌మిశ్రా చిందులేయడం, దుర్భాషలాడటాన్ని తీవ్రంగా ఖండిరచారు. మిశ్రాను తొలగించేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img