Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అనుమానాస్పద స్థితిలో మహంత్‌ నరేంద్రగిరి మృతి

అలహాబాద్‌: అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్రగిరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రయాగ్‌ రాజ్‌లోని బాఘంబరి మఠంలో సోమవారం ఆయన తన గదిలో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ కె.పి. సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహంత్‌ గిరి మృతదేహం పైకప్పుకు వేలాడుతుండటాన్ని అతని శిష్యులు చూశారు. ఆయన రాసిన ఎనిమిది పేజీల సూసైడ్‌ నోట్‌ కూడా ఆప్రదేశంలో లభ్యమైంది. తాను మానసికంగా కలత చెందానని, తన జీవితాన్ని చాలిస్తున్నట్లు రాసి ఉంది. అందులో ఆయన శిష్యుడు ఆనంద్‌ గిరి పేరును ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. ‘ఎంతో గౌరవంతో నేను జీవించాను. అవమానం జరిగాక నేనిక బతకలేను. నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నాను’ అని లేఖలో మహంత్‌ నరేంద్ర గిరి పేర్కొన్నారని పోలీసులు వెల్లడిరచారు. అలాగే ఆయన తన శిష్యులకు వివిధ బాధ్యతలు అప్పగించారని, ఆ వివరాలు కూడా నోట్‌లో రాశారని చెప్పారు. నరేంద్రగిరి ఉరి వేసుకున్నట్లు మఠం నుంచి సాయంత్రం 5:30 గంటలకు పోలీసులకు కాల్‌ వచ్చిందని, పగటిపూట ఆయన ఉన్న అతిథి గృహంలో మృతదేహం లభ్యమైందని ఐజీపీ వివరించారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనిపించినప్పటికీ పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్‌ పరీక్షల తర్వాత ఇతర విషయాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. అఖాడా పరిషత్‌ ఆఫీసు బేరర్లు వచ్చిన తర్వాత అంత్యక్రియలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
నరేంద్రగిరి మృతికి అనేకమంది రాజకీయ ప్రముఖులు, మత పెద్దలు సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను ఎంతో బాధించిందని ట్వీట్‌ చేశారు. దేశంలోని వివిధ అఖాడాలను ఐక్యం చేయడంలో నరేంద్ర గిరి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అంకితమైన ఆయన సేవలందించారని తెలిపారు.
యోగి, అఖిలేశ్‌ దిగ్భ్రాంతి..
మహంత్‌ మృతి ఆధ్యాత్మిక జగత్తుకు తీరని లోటు అని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రాముడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
నరేంద్ర గిరి మృతిపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ఆయన అభిమానులకు ఇవ్వాలని భగవంతుడ్ని వేడుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు.
అనుమానితుల అరెస్టు
మహంత్‌ నరేంద్ర గిరి మృతి కేసులో అనుమానితుడుగా ఉన్న ఆయన శిష్యుడు ఆనంద్‌ గిరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. లేఖలో ప్రస్తావించిన బడే హనుమాన్‌ ఆలయ పూజారి ఆద్య తివారీ, అతని కుమారుడు సందీప్‌ తివారీని కూడా యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ముగ్గురిపైన సెక్షన్‌ 306 ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా మహంత్‌ నరేంద్ర గిరి మృతి పట్ల ఆయన శిష్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతరులను ఎంతో ప్రోత్సహించే నరేంద్ర గిరి వంటి వ్యక్తి ఆత్మహత్య ఎలా చేసుకుంటారని, చదువురాని వ్యక్తి లేఖ ఎలా రాస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయన మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img