Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అలాంటి వ్యక్తితో నాకు పోటీనా?

సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు
చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ పంజాబ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, పార్టీల ప్రచారం, నామినేషన్ల పర్వం జోరందుకుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యర్థిపై సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తన డ్రైవర్‌తో సమానమంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో అమృత్‌సర్‌ తూర్పు నుంచి నవజ్యోత్‌ సింగ్‌ బరిలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆయన శనివారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి, శిరోమణి అకాలీదళ్‌ నేత బిక్రమ్‌ సింగ్‌ మజీతియాపై వ్యాఖ్యలు చేశారు. ‘‘మజీతియా నా డ్రైవర్‌ లాంటి వ్యక్తి. ఆయన నాకు పోటీయే కాదు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ధైర్యముంటే మజీతియా.. అమృత్‌సర్‌ తూర్పు ఒక స్థానం నుంచే పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. తన 17 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదని, అందువల్ల తనను ఎవరూ ఓడిరచలేరని సిద్ధూ అన్నారు. అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమృత్‌సర్‌ తూర్పు స్థానం నుంచి మాజీ మంత్రి బిక్రమ్‌ సింగ్‌ మజీతియా పోటీ చేయనున్నట్లు ఇటీవల శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ప్రకటించారు. దీంతో పాటు మజీతా నుంచి కూడా మజీతియానే అభ్యర్థిగా ప్రకటించింది. డ్రగ్స్‌ కేసులో కొద్దిరోజుల క్రితం బిక్రమ్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన అరెస్టు విషయంతో సిద్ధూ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మజీతియా మాదకద్రవ్యాల దందా నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు రావడం పంజాబ్‌ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ విషయంపై మండిపడ్డ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ సిద్ధూ.. ఆయనను అరెస్టు చేయించేంతవరకూ నిద్రపోనని శపథం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img