Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అవును.. ఆందోళనజీవులమే…

మమ్మల్ని అలా మార్చింది మీరు కాదా!
పోరాటం తప్ప గత్యంతరం లేని దుస్థితి
కేంద్రంపై మేధా పాట్కర్‌ అసహనం

న్యూదిల్లీ : బడా కార్పొరేట్లకు వంత పాటే కేంద్రప్రభుత్వంపై పోరాడటం తప్ప సామాన్యులకు మరో గత్యంతరం లేకుండా పోయిందని, భూమి, భుక్తి ఇలా ప్రతీది పోరాడి సాధించుకునే దుస్థితి నెలకొందని మానవహక్కుల కార్యకర్త, ఫైర్‌బ్రాండ్‌ మేధాపాట్కర్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభ్వుత్వ కార్పొరేట్‌ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని, అణగారిన వర్గాలు మరింత అణచివేతకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, మైనారిటీల వెతలు వర్ణనాతీతంగా మారాయన్నారు. మేధాపాట్కర్‌ చున్నీభాయ్‌ వైద్య స్మారకోపాన్యాసం చేస్తూ మోదీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండిరచారు. ‘అవును.. మేము ఆందోళనజీవులమే.. మమ్మల్ని ఇలా మార్చింది మీరు కాదా అంటూ సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టుపై పెద్ద ఆనకట్టలకు వ్యతిరేకంగా 36ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన పాట్కర్‌ ప్రశ్నించారు. డ్యామ్‌ నీళ్లు నగరాలకు సరఫరా కాగా సౌరాష్ట్ర, కచ్‌లోని అనేక ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. చున్నీభాయ్‌ను చున్నీకాక అనేవారని, అహింస పద్ధతులు, పోరాటాలు ఆయనకు గుజరాత్‌ నవయుగ గాంధీ పేరును తెచ్చిపెట్టాయని అన్నారు. గుజరాత్‌ లోక్‌సమితిలో చున్నీభాయ్‌ నేతృత్వంలో సాగిన ప్రజాపోరాటాలతో బడా కార్పొరేట్లు తమ పద్ధతులను మార్చకోక తప్పలేదన్నారు. రైతుల మహోద్యమాన్ని ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయించిన అన్నదాతల ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని. ప్రజానిరసన మిన్నంటిన కారణంగానే ఇది సాధ్యమైందని అన్నారు. పార్టీ రాజకీయాలతో సంబంధం లేని నిజమైన రాజకీయ పోరాటాలకు ఇది సమయమని పాట్కర్‌ సూచించారు. ఆదివాసీలు, దళితుల సమస్యలను అర్థం చేసుకోగలగడమే కాకుండా ఆయా వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వాలకు ఆర్థిక చేయూత ఇవ్వగల ఐరాస, ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు తరహా అంతర్జాతీయ ఏజెన్సీల స్థాయిలో పోరాటానికి సమయం ఆసన్నమైందన్నారు. మన పోరాటాలకు విదేశాల నుంచి విరాళాలు అందుతున్నాయని ఆరోపిస్తారుగానీ పీపీపీ నమూనా విధానాలకు పెద్ద మొత్తాలు ఎలా అందుతాయో మాత్రం చెప్పరని కేంద్రాన్ని దుయ్యబట్టారు. పీఎం కేర్స్‌లోకి ఎంత మేరకు విదేశీ నిధులు వచ్చి చేరాయి? విపత్తు నివారణ నిధి ఏమైంది? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. గిరిజనులు, భూమిలేనివారు, పేదలు, రైతుల కోసం మంచి చేసేందుకు డబ్బు లేదనే ప్రభుత్వానికి సెంట్రల్‌ విస్టా, సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటుతో పాటు కార్పొరేట్ల ఎన్పీయేల మాఫీకి రూ.68వేల కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పోరాటబాట పట్టడం తప్ప ప్రజలకు మరో గత్యంతరం లేకుండా పోయిందని, తద్వారా వారు ఆందోళనజీవులయ్యారని మేధాపాట్కర్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img