Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఆయన రాజీనామా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కాదు : బొమ్మై

బెంగళూరు : గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప రాజీనామా అంశం… తమ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కాబోదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మయ్‌ పేర్కొన్నారు. ఈశ్వరప్ప తనంతట తానే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని, దర్యాప్తు అనంతరం అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీరును ఆయన తప్పుబట్టారు. ప్రతిపక్షాలు… దర్యాప్తు అధికారిగానో, న్యాయమూర్తిగానో, ఉండవలసిన అవసరం లేదన్నారు. కాగా కర్ణాటకలో బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బిఎస్‌ యడియూరప్ప తన పాత మిత్రుడైన ఈశ్వరప్పకు వత్తాసు పలికారు. త్వరలోనే అన్ని ఆరోపణలనుంచి బయటపడి మళ్లీ మంత్రి పదవి చేపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల్లో దర్యాప్తు పూర్తవగానే ఈ కేసులో తన పాత్ర ఏదీ లేదని వెల్లడవుతుందన్నారు. ఈశ్వరప్ప అమాయకుడు… ఆయన మంత్రి కావడానికి ఎటువంటి అడ్డంకులు ఉండబోవని యడియూరప్ప చెప్పుకొచ్చారు.
అరెస్టు చేయాల్సిందే : కాంగ్రెస్‌
కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ మంగళవారం ఉడుపిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రాసినట్లు చెప్తున్న ఆత్మహత్య లేఖలో కర్ణాటక మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పపైనా, ఆయన అనుచరులపైనా నేరుగా ఆరోపణలు చేశారు. తన చేత చేయించిన కాంట్రాక్టు పనులకు బిల్లులను చెల్లించడంలో తనను తీవ్రంగా వేధించారని, ముడుపుల కోసం బెదిరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఈశ్వరప్పను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తోంది. కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ నేతృత్వంలో గురువారం రాత్రి శాసన సభ వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. మంత్రి ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేసినంత మాత్రానికి సరిపోదని, రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదని, ఆయనపై అవినీతి నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేయాలని శివ కుమార్‌ డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్‌ సంతోష్‌ను 40 శాతం కమీషన్‌ చెల్లించాలంటూ వేధించారని ఆయన తల్లి, భార్య, సోదరుడు ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంట్రాక్టర్‌ ఆత్మహత్య నేపథ్యంలో మంత్రి ఈశ్వరప్పపైనా, ఆయన ఇద్దరు సహచరులపైనా కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img