Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆర్‌ఎస్‌ఎస్‌ గుప్పెట్లో వ్యవస్థలు

రాజ్యాంగం ఆయుధమే..కానీ: రాహుల్‌
న్యూదిల్లీ: వ్యవస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌ పూర్తిగా ఆక్రమించుకుందని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. రాజ్యాంగం ముమ్మాటికీ ఓ ఆయుధమేనని, కానీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోతే దానికి అర్థమేముంటుందని ఆయన ప్రశ్నించారు. బీఎస్‌పీ అధినేత్రి మాయావతిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామన్న కాంగ్రెస్‌ ప్రతిపాదనకు ఆమె స్పందించలేదని ఆరోపించారు. ‘ది దళిత్‌ ట్రూత్‌’ పుస్తకాన్ని శనివారం ఆవిష్కరిస్తూ రాహుల్‌గాంధీ మాట్లాడారు. దళితులు తమ హక్కుల కోసం అంబేద్కర్‌, మహాత్మాగాంధీ చూపిన మార్గంలో పోరాడాలని రాహుల్‌ పిలుపునిచ్చారు. ‘భారతదేశానికి రాజ్యాంగం ఓ ఆయుధం. అయితే, వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోతే ఆ రాజ్యాంగానికి అర్థం లేదు. రాజ్యాంగ పరిరక్షణ గరించి మేము మాట్లాడుతున్నాం. అసలు రాజ్యాంగం ఎక్కడ అమలవుతోంది? వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా? అన్ని వ్యవస్థలు ఆర్‌ఎస్‌ఎస్‌ గుప్పెట్లోనే ఉన్నాయి’ అని రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలు ప్రజలు, దేశం చేతిలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజ్యాంగంపై ఇది కొత్తగా జరిగే దాడేమీ కాదని, మహాత్మాగాంధీని దారుణంగా కాల్చిచంపడంతోనే ప్రారంభమైందని ఆయన అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ ప్రజలకు బలమైన ఆయుధం అప్పగించారని, కానీ నేడు ఆ ఆయుధానికి అర్థం లేకుండా పోయిందని మండిపడ్డారు. మీడియాను నియంత్రిస్తున్నారని, రాజకీయ నాయకులను అదుపు చేయడానికి పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని తాను కోరుకోవడం లేదని, అయితే, రాజకీయ వ్యవస్థ నియంత్రణలో సీబీఐ, ఈడీ పనిచేస్తున్నాయని విమర్శించారు. మాయావతి విషయాన్ని ప్రస్తావిస్తూ యూపీలో కూటమి ఏర్పాటు చేద్దామని ఆమెకు సందేశం పంపామని, తాను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాని చెప్పారు గానీ తమతో చర్చలకు ముందుకు రాలేదని రాహుల్‌ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తమకు నష్టం జరుగుతున్నా దళితవాణి వినిపించడానికి కారణమైన కాన్షీరామ్‌ పట్ల తనకు అపార గౌరవం ఉందని చెప్పారు. సీబీఐ, ఈడీ, పెగాసస్‌ కారణంగా పాలక బీజేపీ ఒత్తిళ్లకు మాయావతి లొంగిపోయారని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగం సక్రమంగా అమలు కాకపోతే దళితులు, మైనారిటీలు, గిరిజనులు, నిరుద్యోగులు, సన్నకారు రైతులు, నిరుపేదలు నష్టపోతారని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ పోరాటానికి ఇదే సరైన సమయమని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img