Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆ అభ్యర్థుల్లో 21 శాతం మంది క్రిమినల్స్‌

ఏడీఆర్‌ నివేదిక వెల్లడి
న్యూదిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఆరో దశలో మార్చి 3న జరగనున్న పోలింగ్‌లో పోటీపడనున్న అభ్యర్థుల్లో 21 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డిమోక్రటిక్‌ రిఫార్మ్‌ (ఏడీఆర్‌) అధ్యయనంలో తెలిపింది. ఈ దశలో మొత్తం 670 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా 151 మందిపై హత్య, అత్యాచారం, అత్యాచారానికి యత్నించడం వంటి కేసులు ఉన్నట్లు నివేదిక తెలిపింది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్‌ల ఆధారంగా ఏడీఆర్‌ ఈ నివేదికను తయారుచేసింది. వీరిలో అత్యధిక శాతం మంది సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)కి చెందినవారు ఉండటం గమనార్హం. ఆ పార్టీ నుంచి మొత్తం 48 మంది అభ్యర్థులు పోటీచేస్తుండగా వారిలో 29 మంది (60శాతం)పై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. బీజేపీ నుంచి మొత్తం 52 మంది అభ్యర్థుల్లో 20 మంది (39శాతం)పై, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న 52 మందిలో 20 మంది (36శాతం)పై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. బహుజనసమాజ్‌ పార్టీ (బీఎస్పీ) నుంచి పోటీలో ఉన్న 57 మందిలో 18 మంది (32 శాతం), ఆప్‌కు చెందిన 51 మంది అభ్యర్థులలో ఐదుగురు (10 శాతం మంది) అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని తెలిపింది. ఇద్దరు అభ్యర్థులు అత్యాచారం కేసులు ఎదుర్కొంటుండగా, ఎనిమిది మంది హత్య, 23 మందిపై హత్యకు యత్నించడం వంటి కేసులు ఉన్నాయి. మార్చి 3న జరగనున్న ఆరో దశ పోలింగ్‌లో మొత్తం 57 నియోజకవర్గాల్లో 37 (65శాతం) రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. క్రిమినల్‌ కేసులు ఉన్న అభ్యర్థులు ఎక్కువమంది పోటీపడుతున్న నియోజకవర్గాలను రెడ్‌ అలర్ట్‌గా ప్రకటిస్తారు. నేర చరితులే చట్టసభ సభ్యులుగా మారుతుండటంతో చట్టాన్ని ఉల్లంఘించే వారి చేతుల్లో మన ప్రజాస్వామ్యం బాధపడుతూనే ఉంటుందని ఏడీఆర్‌ నివేదిక స్పష్టం చేసింది. 670 మంది అభ్యర్థుల్లో 253 మంది ఆస్తుల విలువ కోటి రూపాయల కంటే ఎక్కువేనని తెలిపింది. ఒక్కొక్క అభ్యర్థి ఆస్తుల సగటు విలువ రూ. 2.10 కోట్లుగా ఉందని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img