Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఆ పరీక్ష వద్దేవద్దు…

కేంద్రం సీయూఈటీని ఉపసంహరించుకోవాలి
తీర్మానాన్ని ఆమోదించిన తమిళనాడు అసెంబ్లీ
బీజేపీ మినహా మద్దతు తెలిపిన ఇతర పార్టీలు

చెన్నై : విశ్వవిద్యాలయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) నిర్వహణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు రాష్ట్ర శాసనసభ సోమవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. నీట్‌ వంటిది పాఠశాల విద్యను పక్కదారి పట్టిస్తుందని, పాఠశాలల్లో మొత్తం అభివృద్ధి ఆధారిత అభ్యాసాన్ని బలహీనపరుస్తుందని, విద్యార్థులలో ఒత్తిడికి దారితీస్తుందని, కోచింగ్‌ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయని తీర్మానం తెలిపింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సభను బహిష్కరించగా, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలతో సహా అధికార డీఎంకేకు చెందిన అన్ని మిత్రపక్షాలు మద్దతు ఇచ్చాయి. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కూడా ఈ చర్యకు మద్దతు ఇచ్చింది. పరీక్షను ‘మొగ్గలోనే తుంచివేయడం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా 12వ తరగతి విద్యార్థులు సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోకుండా జాతీయ పరీక్ష మార్కుల ఆధారంగా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు ఉంటాయని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సీయూఈటీకి సంబంధించిన ప్రకటనను ఈ తీర్మానంలో ప్రస్తావించారు. ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) సిలబస్‌పై ఆధారపడిన ఏదైనా ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర బోర్డు సిలబస్‌లలో చదివిన విద్యార్థులందరికీ సమాన అవకాశాన్ని అందించదని అసెంబ్లీ భావిస్తోంది’ అని తీర్మానం పేర్కొంది. రాష్ట్ర బోర్డ్‌ సిలబస్‌ మొత్తం విద్యార్థుల జనాభాలో 80 శాతానికి పైగా ఉన్నారు. ఈ విద్యార్థులు అట్టడుగు వర్గాలకు చెందినవారు. అందువల్ల ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ ఆధారిత ప్రవేశ పరీక్ష కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందడంలో ఈ అర్హులైన మెజారిటీని ప్రతికూల స్థితిలో ఉంచుతుంది. ‘తమిళనాడు విషయానికొస్తే, సీయూఈటీ వల్ల వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని అసెంబ్లీ భావిస్తోంది’ అని శాసనసభ తీర్మానం వివరించింది. ‘నీట్‌, సీయూఈటీ వంటిది దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న పాఠశాల విద్యా వ్యవస్థలను పక్కదారి పట్టిస్తుంది. పాఠశాలల్లో మొత్తం అభివృద్ధి, ఆధారిత దీర్ఘకాల అభ్యాసం ఔచిత్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. విద్యార్థులు తమ ప్రవేశ పరీక్ష మార్కులను మెరుగుపరచడానికి కోచింగ్‌ సెంటర్‌లపై ఆధారపడేలా చేస్తుందనడంలో సందేహం లేదు’ అని పేర్కొంది. ‘తమిళనాడు ప్రజలు కోచింగ్‌ సెంటర్లను మరింత పుట్టగొడుగుల్లాగా పెంచడానికి మాత్రమే అనుకూలం. సాధారణ పాఠశాల విద్యతో పాటు ఇటువంటి ప్రవేశ పరీక్షను అమలు చేయడం విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి దారితీస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను వినియోగించుకోవడానికి ఈ సభ ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష నిర్వహణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి’ అని నొక్కి చెప్పింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, రాష్ట్ర విద్యా హక్కుపై కేంద్ర ప్రభుత్వ దాడి కొనసాగుతోందని అన్నారు. రాష్ట్ర, ప్రైవేట్‌, డీమ్డ్‌ వర్సిటీలు కూడా సీయూఈటీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని పరీక్షకు సంబంధించిన ప్రకటన పేర్కొంది. కాగా ఈ తీర్మానం తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా చూస్తుందని, దీనిని ఆమోదించాలని కోరారు. ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత డీఎంకే కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, పీఎంకే, ఏఐఏడీఎంకేకు చెందిన మాజీ ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పి.అన్బళగన్‌ తీర్మానానికి మద్దతుగా మాట్లాడారు. బీజేపీ సభ్యుడు నైనార్‌ నాగేంద్రన్‌ తీర్మానాన్ని వ్యతిరేకించారు. దానిని పునః పరిశీలించవలసిందిగా కోరారు. తర్వాత తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వాకౌట్‌ చేశారు. అంతకుముందు, సీయూఈటీ స్కోర్‌ని ఉపయోగించడం ఇతర విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఐచ్ఛికమని నాగేంద్రన్‌ సూచించినప్పుడు, ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి జోక్యం చేసుకుని నీట్‌ (నేషనల్‌ ఎంట్రన్స్‌-కమ్‌-ఎలిజిబిలిటీ టెస్ట్‌) కూడా ఇదే ప్రారంభాన్ని కలిగి ఉందని అన్నారు. ఇదిలాఉండగా, మినహా మిగిలిన అన్ని పార్టీలు ప్రభుత్వ చర్యను స్వాగతించాయని, అది తీర్మానానికి ప్రోత్సాహాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. తమిళనాడు ప్రజల మనోభావాలను ఈ తీర్మానం ప్రతిబింబిస్తోందని, ప్రతిపాదిత పరీక్షను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. అనంతరం మూజువాణి ఓటు ద్వారా తీర్మానాన్ని ఆమోదించగా స్పీకర్‌ ఎం.అప్పావు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img