Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఈవీఎంల వినియోగానికి వ్యతిరేకంగా పిల్‌

విచారణకు సుప్రీం అంగీకారం
న్యూదిల్లీ : ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాల స్థానంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ల (ఈవీఎం) వినియోగాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. బ్యాలెట్‌ పత్రాల స్థానంలో ఈవీఎంలు ప్రవేశపెట్టేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధన రాజ్యాంగబద్దంగా చెల్లుబాటు కాదని న్యాయవాది ఎంఎల్‌ శర్మ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణల ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని పరిశీలించడానికి అంగీకరించారు. యూపీ, గోవా సహా ఐదు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ అవసరమని న్యాయవాది ఎంఎల్‌ శర్మ ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. ఈవీఎంల వినియోగం విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 61ఏ ని పార్లమెంటు ఆమోదించలేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు తగిన సాక్ష్యాలను పిల్‌లో పొందు పర్చినట్టు తెలిపారు. ఈవీఎంల వినియోగం రాజ్యాంగ విరుద్దమని ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు. వాదనల అనంతరం స్పందించిన న్యాయమూర్తి వ్యాజ్యాన్ని పరిశీలిస్తామని అవసరమైతే సుప్రీంకోర్టు బెంచ్‌ వద్ద జాబితా చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img