Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉత్తరాఖండ్‌ తొలి మహిళా స్పీకర్‌గా రీతూ ఖండూరి

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే రీతూ ఖండూరి ఏగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తోన్న బన్సీధర్‌ భగత్‌ శనివారం స్పీకర్‌ ఎన్నికను నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పోటీకి దూరంగా ఉండడంతో బీజేపీ అభ్యర్థి అయిన రీతూ ఖండూరి ఎన్నిక లాంఛనప్రాయమైంది. మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె అయిన రీతూ తాజాగా జరిగిన ఎన్నికల్లో కోట్‌ద్వార్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎస్‌ఎస్‌ నేగీపై గెలుపొందారు. ఆమె 2017లో యమకేశ్వర్‌ స్థానం నుంచి గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. రాజకయాల్లోకి రాకమునుపు నొయిడాలోని ఒక ప్రైవేటు వర్సిటీలో ఆచార్యులుగా పని చేశారు. రీతూ ఖండూరి అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికవడం పట్ల సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మహిళలు నిర్వహించిన పాత్రకు ఇది గుర్తింపు అని పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మకమైన రోజని చెప్పారు. స్పీకర్‌గా రీతూ ఎంపిక పట్ల ప్రతిపక్ష నేతలు ప్రీతమ్‌సింగ్‌, యశ్‌పాల్‌ ఆర్య తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు. తండ్రి ఆశయాల సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. మహిళా స్పీకర్‌గా శాసనసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా స్పీకర్‌గా ఎన్నికైన రీతూ ఎమ్మెల్యేలను ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రతి సభ్యుడు తమ పదవీ కాలాన్ని శాసనసభ విధి విధానాలను తెలుసుకునేందుకు వినియోగించాలని సూచించారు. సభలో ప్రజా ప్రయోజనకరమైన చర్చలు జరపాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img