Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఉప ఎన్నికల ప్రకటనతో వేడెక్కిన బెంగాల్‌ రాజకీయం

కోల్‌కతా : కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఉప ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయవేడి పుంజుకుంటోంది. ఇప్పుడు అందరి దృష్టి భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంపైనే కేంద్రీకృతమైంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని భావించడమే అందుకు కారణం. ఇక్కడి నుంచి మమత పోటీ చేయనున్నారని ఎప్పడు నుంచో వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికను సెప్టెంబరు 30న నిర్వహించి.. అక్టోబరు 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. భవానీపూర్‌తో పాటు రాష్ట్రంలోని శంషేర్‌గంజ్‌, జంగీపూర్‌కు,ఒడిశాలోని పిప్లి స్థానానికి కూడా ఇదే షెడ్యూల్‌లో ఉపఎన్నికలు జరుగుతాయని తెలిపింది. అయితే దేశవ్యాప్తంగా 31 అసెంబ్లీ స్థానాలకు, 3 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు వాయిదా వేసినట్లు పేర్కొంది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ ఘనవిజయం సాధించినా, నందిగ్రామ్‌లో మమత 1956 ఓట్ల తేడాతో తృణమూల్‌ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. భవానీపూర్‌ నుంచి గెలిచిన టీఎంసీి నేత సోవన్‌దేవ్‌ చటోపాధ్యారు మమత పోటీ చేసేందుకు వీలుకల్పిస్తూ రాజీనామా చేశారు. 2011, 2016 అసెంబ్లీ ఎన్నికలలో మమత ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అధికారంలోకి రాకుండా చూసేందుకు, ముఖ్యంగా సువేందు అధికారిని కట్టడిచేసేందుకు మమత నందిగ్రామ్‌ నుంచి పోటీచేశారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఆమె శాసనసభకు తప్పక ఎన్నిక కావాల్సివుంది. అయితే, ఆరు నెలలలోగా మమత అసెంబ్లీకి ఎన్నికకాకుండా అడ్డుకునేందుకు కేంద్రం విఫలయత్నం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీపై భ్రమలుపెంచుకుని ఎన్నికల ముందు తృణమూల్‌ను వీడి ఆ పార్టీలోకి వెళ్లినవారంతా ఇప్పుడు తిరిగి రావడం ప్రారంభించారు. ఇప్పటికే అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తిరిగి తృణమూల్‌లోకి వచ్చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ, సెప్టెంబరు, అక్టోబరులో థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో ఉప ఎన్నికలు నిర్వహించరేమోనని మమత తీవ్ర ఆందోళన చెందారు. ఆ పార్టీకి చెందిన ప్రతినిధిబృందం అనేక సార్లు ఎన్నికల కమిషన్‌ను కలిసి ఉప ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఆరు నెలలలోగా ఎన్నికలు జరపకపోతే మమత ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగి వేరే నాయకునికి ఆ పదవిని అప్పగించాల్సి వచ్చేది. కనుక సకాలంలో ఉప ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోందని తృణమూల్‌ తీవ్రంగా విమర్శించింది. బెంగాల్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి, రాజ్యాంగపరమైన ఆవశ్యకత దృష్ట్యా రాష్ట్రంలో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఈసీ శనివారం తెలిపింది. ఈ ఎన్నికలలో మమత భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img