Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఏబీజీ షిప్‌యార్డు కుంభకోణంలో పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగుల పాత్ర లేదు

ఐసీఐసీఐ బ్యాంకు కన్సార్టియం కింద రుణం మంజూరు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూదిల్లీ : ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (ఏబీజీఎస్‌ఎల్‌) రూ.14,349 కోట్ల బ్యాంక్‌ కుంభకోణంలో ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌యూ) ఉద్యోగులెవరూ పాలుపంచుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ నేతృత్వంలోని కన్సార్టియం ఏర్పాటు కింద ఏబీజీ షిప్‌యార్డ్‌కు రుణం మంజూరయిందని, షిప్‌యార్డు ఖాతాను 2013, ఆగస్టులో ఎన్‌పీఏ(నిరర్ధక ఆస్థి)గా ప్రకటించినట్లు చెప్పారు. కంపెనీపైనా, దాని డైరెక్టర్లపైనా సీబీఐ గత నెలలో కేసు నమోదు చేసిందని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సీతారామన్‌ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. సీడీఆర్‌ సాధికారత సమూహం ద్వారా మార్చి 2014లో కార్పొరేట్‌ రుణ పునర్నిర్మాణం (సీడీఆర్‌) కింద పునర్నిర్మాణం కోసం కంపెనీకి రుణం ఆమోదం పొందింది. అయితే సీడీఆర్‌ వైఫల్యం, ఖాతాను ఎన్‌పీఏగా వర్గీకరించిన తరువాత, కంపెనీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించడానికి రుణదాత బ్యాంకులు ఇవైని నియమించాయని సీతారామన్‌ చెప్పారు. జనవరి 2019లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక (ఎఫ్‌ఏఆర్‌) ప్రకారం, ఏబీజీఎస్‌ఎల్‌ ఖాతా రూ.14,349 కోట్ల ప్రధాన మొత్తం, దానిపై వచ్చిన వడ్డీని, ఏప్రిల్‌ 25, 2019న లీడ్‌ బ్యాంక్‌లు మోసంగా ప్రకటించాయని ఆమె తెలిపారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం, సిబ్బంది జవాబుదారీతనంతో వ్యవహరించారు. ఎన్‌పీఏ తర్వాత సిబ్బంది లోపాలు, వారి ప్రమేయం ఏదీ అందులో వెల్లడి కాలేదు’ అని వివరించారు. నవంబర్‌ 8, 2019న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కి ఫిర్యాదు చేసిందని, తదనంతరం, ఎస్‌బీఐ కన్సార్టియం రుణదాతల తరఫున ఫిర్యాదు చేయాలని జనవరి 2020లో జాయింట్‌ లెండర్ల సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. తదుపరి చర్చల ఆధారంగా తుది ఫిర్యాదు డిసెంబర్‌లో దాఖలయిందని అన్నారు. ఫిబ్రవరి 7, 2022న కంపెనీ, దాని డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసిందని సీతారామన్‌ చెప్పారు. ఇదిలాఉండగా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ), సిండికేట్‌ బ్యాంక్‌, దేనా బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌లలతో సహా 27 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ ఏర్పాటు సమయంలో ఏబీజీఎస్‌ఎల్‌కి కన్సార్టియం రుణాలు ఇచ్చాయి. కంపెనీకి అత్యధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.7,089 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్‌ రూ.3,639 కోట్లు, ఎస్‌బీఐ రూ.2,925 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.1,614 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.1,244 కోట్లు, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ రూ.1,327 కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ రూ.1,228 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.719 కోట్లు, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ రూ.743 కోట్లు. అంతకుముందు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇప్పుడు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) లో విలీనం అయింది. దీని మొత్తం రూ.714 కోట్లు, సిండికేట్‌ బ్యాంక్‌ (ప్రస్తుతం కెనరా) రూ.408 కోట్లు, దేనా బ్యాంక్‌ (ఇప్పుడు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా) రూ.406 కోట్లు, ఆంధ్రా బ్యాంక్‌ (ప్రస్తుతం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) రూ.350 కోట్లుగా ఉన్నాయి. అలాగే ఇతర బ్యాంకుల్లో ఐఎఫ్‌సీఐ రుణం రూ.300 కోట్లు, ఎస్‌బీఐ సింగపూర్‌ రూ.458 కోట్లు, ఎస్‌ఐసీవోఎం లిమిటెడ్‌ రూ.260 కోట్లు ఉన్నాయి. కాగా అతిపెద్ద బ్యాంకు మోసం కేసుగా పేర్కొంటూ ఫిబ్రవరి 14, 2022న బ్యాంకుల కన్సార్టియంను మోసం చేశారనే ఆరోపణలపై ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌, దాని మాజీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రిషి కమలేష్‌ అగర్వాల్‌తో పాటు ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img