Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఐదేళ్లలో సంపన్నులైన యూపీ ఎమ్మెల్యేలు

మళ్లీ పోటీ చేస్తున్న 90శాతం మంది ఆస్తులు పెరిగాయ్‌
ఈ జాబితాలో బీజేపీ అభ్యర్థులే టాప్‌

న్యూదిల్లీ : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు పోటీ చేసే అభ్యర్థులంతా గత ఐదేళ్లలో సంపన్నుల జాబితాలో చేరినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స (ఏడీఆర్‌), ఉత్తరప్రదేశ్‌ ఎలక్షన్‌ వాచ్‌ (యూపీఈడబ్ల్యూ) తాజా నివేదిక చెబుతోంది. ఇలా సంపన్నులు అయిన వారిలో బీజేపీ ఎమ్మెల్యేలు టాప్‌లో ఉండగా ఆ తర్వాత స్థానంలో ఎస్పీ, బీఎస్పీ ఉన్నట్లు నివేదిక తెలిపింది. 2017 నుంచి చూస్తే వీరి ఆస్తులు బాగా పెరిగాయని వెల్లడిరచింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి దశలవారీగా పోలింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతలు ముగిశాయి. అసెంబ్లీకి మళ్లీ పోటీ చేసే 90శాతం మంది ఆస్తులు ఐదేళ్లలో గణనీయంగా పెరిగినట్లు నివేదిక చెబుతోంది. 2017లో స్వతంత్రులతో కలిపి 301 మంది శాసనసభ్యుల ఆస్తుల సగటు విలువ మొత్తం రూ.5.68 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. 2022 ఎన్నికల అఫిడవిట్‌ల ప్రకారం ఈ మొత్తం రూ.8.87 కోట్లకు పెరిగిందన్నారు. 301 మంది ఎమ్మెల్యేలు / ఎమ్మెల్సీల్లో 284 మంది అంటే 94శాతం మంది ఆస్తులు 22,057శాతం వరకు పెరిగాయి. 17 మంది ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలలో ఆరు శాతం మంది ఆస్తులు మైనస్‌ ఒకశాతం నుంచి మైనస్‌ 36శాతం వరకు తగ్గినట్లు నివేదిక తెలిపింది. రాయ్‌బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థి అదితీ సింగ్‌ ఈ జాబితాలో టాప్‌ ఐదుగురిలో ఉన్నారు. 2017 నుంచి ఆమె ఆస్తులు రూ.30కోట్లు పెరిగాయి. 2017లో రూ.13.98 లక్షలు ఉంటే 2022 నాటికి అవి రూ.30.98 కోట్లు అయ్యాయి. గతేడాది బీజేపీలో చేరిన సింగ్‌ 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి భారీ ఓట్ల తేడాతో గెలిచారు. ఏఐఎంఐఎం ముబారక్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి ఆస్తుల విలువ రూ.118.76 కోట్లు (2017లో) నుంచి రూ.195.85 కోట్లకు (2022లో) పెరిగాయి. బీజేపీకి చెందిన సహేందర్‌ సింగ్‌ రమలా ఆస్తులు రూ.38.04 కోట్ల నుంచి రూ.84.50 కోట్లకు పెరిగినట్లు నివేదిక వెల్లడిరచింది. రమలా బీజేపీ టికెట్‌పై ఛాప్రౌలీ నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ ఫుల్పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి ప్రవీణ్‌ పటేల్‌ ఆస్తుల విలువ 2017లో రూ.8.26 కోట్లుగా ఉంటే 2022లో రూ.40.26 కోట్లకు చేరింది. ఏడీఆర్‌యూపీఈడబ్ల్యూ పార్టీలవారీగా జరిపిన విశ్లేషణ ప్రకారం రెండవసారి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల ఆస్తులే ఈ ఐదేళ్లలో అత్యధికంగా పెరిగినట్లు తెలుస్తోంది. 223 మంది బీజేపీ అభ్యర్థులు సగటు ఆస్తులు 2017లో రూ.5.27 కోట్ల నుంచి 59.87శాతానికి పెరిగినట్లు నివేదిక చెబుతోంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన 55 మంది అభ్యర్థుల ఆస్తులు రూ.4.60 కోట్ల నుంచి రూ.6.73 కోట్లకు పెరిగాయి. బీఎస్పీ అభ్యర్థుల ఆస్తులు 47.42శాతం పెరిగాయి. రూ.9.82 కోట్ల నుంచి రూ.14.48 కోట్లకు పెరిగాయి. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఆస్తుల్లో 10.88శాతం పెంపు నమోదు కాగా 2017 నుంచి 2022 వరకు రూ.8.84కోట్ల నుంచి రూ.9.80 కోట్లకు పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులు స్వయంగా ఇచ్చిన అఫిడవిట్‌ల ఆధారంగానే తమ నివేదికను రూపొందించినట్లు ఏడీఆర్‌యూపీఈడబ్ల్యూ వెల్లడిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img