Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కర్ణాటక స్థానిక పోరులో పుంజుకున్న కాంగ్రెస్‌

501 వార్డులు కైవసం
443కే పరిమితమైన బీజేపీ
కీలకంగా మారిన జేడీఎస్‌

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ బలం క్రమేణా పెరుగుతోంది. ఇటీవల శాసనమండలికి జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధించింది. తాజాగా కర్ణాటకలో 58 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో గణనీయ విజయాలు నమోదు చేసింది. మొత్తం 1184 సీట్లకుగాను కాంగ్రెస్‌ 501 కైవసం చేసుకుంది. అధికార బీజేపీ 443 సీట్లకు పరిమితమైంది. జేడీఎస్‌ 45 సీట్లు గెలుచుకోగా 195 మంది స్వతంత్రులు విజయం సాధించారు. ఆప్‌, జనతాపార్టీ ఒక్కో సీటు, ఏఐఎంఐఎం రెండు, ఎస్‌డీపీఐ ఆరు సీట్లు గెలుచుకున్నాయి. మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా బీజేపీ సవాళ్లను అధిగమించడానికి కాంగ్రెస్‌కు మంచి అవకాశం లభించింది. 20 మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌ సంపూర్ణ మెజారిటీ సాధించగా బీజేపీ 15తో సరిపెట్టుకుంది. జేడీఎస్‌కు కేవలం రెండు మున్సిపాలిటీలు మాత్రమే దక్కాయి. మిగిలిన మున్సిపాలిటీలలో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాలేదు. మూడు మున్సిపాలిటీలలో జేడీఎస్‌ మద్దతు అత్యంత కీలకమైంది. కాంగ్రెస్‌కుగానీ లేదా బీజేపీకిగానీ మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఇటీవల హంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. బీజేపీ స్థానాన్ని కాంగ్రెస్‌ గెలుచుకోగలిగింది. నాటి నుంచి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధిస్తోంది. శాసనమండలికి సంబంధించి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 11 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నుంచి పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ అద్భుత విజయం సాధించింది. కిట్టూరు తాలూకాలో ఎంకే హుబ్బళి నగర పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 14 వార్డులను ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. నాగనూరు నగర పంచాయతీ ఎన్నికల్లోనూ మొత్తం 17 సీట్లను స్వతంత్రులే కైవసం చేసుకున్నారు. గోరెగావ్‌ పట్టణ పంచాయతీ ఇండిపెండెంట్లు చేతికి చిక్కింది. పార్టీ సాధించిన ఫలితాలపై ప్రతిపక్ష నేత సిద్దరామయ్య సంతోషం వెలిబుచ్చారు. ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు. డబ్బుతో విజయం సాధించవచ్చన్న బీజేపీ అహంకారాన్ని ప్రజలు అణచివేశారని సిద్దరామయ్య పేర్కొన్నారు. కేవలం డబ్బుతో మాత్రమే విజయం సాధించలేరని, ప్రజలకు మంచి పనులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. శాసనమండలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, బీజేపీ 11 సీట్ల చొప్పున గెలుచుకున్నాయి. కాంగ్రెస్‌కు 48శాతం ఓట్లు రాగా బీజేపీకి 41శాతం మాత్రమే లభించాయి. ఈ ఫలితం బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాతీర్పు ఇచ్చినట్లు అర్థమవుతోందని సిద్దరామయ్య చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని తాను చెప్పబోనని, అయితే బీజేపీ ప్రభుత్వ దుష్టపాలనపై ప్రజాగ్రహం పెల్లుబికిందని చెప్పారు. జేడీఎస్‌ అభ్యర్థులు పెద్దసంఖ్యలో గెలవకపోయినప్పటికీ తమ మద్దతు లేకుండా చాలా మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు ఏర్పడే అవకాశం లేదని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి చెప్పారు. ఎన్నికల్లో తాము డబ్బు ఖర్చు పెట్టలేదని ఆయన తెలిపారు. విజయపుర, రాయ్‌చూర్‌, సిరా, మరికొన్ని ప్రాంతాల్లో జేడీఎస్‌ సభ్యులు అద్భుత విజయాలు సాధించారని చెప్పారు. మొత్తం ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ ఎక్కువ సీట్లే సాధించిందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై చెప్పుకున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మంచి ఫలితాలు సాధించామన్నారు. మైనారిటీలు అధికంగా గల ప్రాంతాల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img