Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కాంగ్రెస్‌దే విజయం

ప్రతిపక్షాలకు అంత సీన్‌ లేదు
పంజాబ్‌ ఎన్నికలపై సచిన్‌ పైలట్‌ స్పష్టీకరణ

న్యూదిల్లీ: పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ను ఢీకొట్టే ప్రతిపక్షం లేదా కూటమి పంజాబ్‌లో లేదని చెప్పారు. ఏ ప్రతిపక్ష పార్టీగానీ లేదా కూటమి గానీ పూర్తి మెజారిటీ సాధించే పరిస్థితిలో లేదని పైలట్‌ అన్నారు. పంజాబ్‌లో బహుముఖ పోటీ జరుగుతుందని, ప్రతిపక్షాలు కూడా అంత పటిష్టవంతంగా లేవని తెలిపారు. ప్రతిపక్షాలు ఎంతమొత్తుకున్నా ప్రజలు తమ ఓటును వృధా చేసుకోబోరని చెప్పారు. పంజాబ్‌ వంటి సున్నితమైన సరిహద్దు రాష్ట్రాన్ని పాలించడానికి కాంగ్రెస్‌ పార్టీయే సరైనదని, ఆప్‌కు అంత అనుభవం లేదని అభిప్రాయపడ్డారు. సచిన్‌ పైలట్‌ శుక్రవారం ఇక్కడి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆయన పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోవడంతో కెప్టెన్‌ అమరేందర్‌సింగ్‌ను సీఎం పదవి నుంచి తొలగించినట్లు పైలట్‌ తెలిపారు. ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌(సంయుక్త) ప్రభావమేమీ ఎన్నికల్లో ఉండదని చెప్పారు. ఎన్నికల వేళ కేంద్ర మాజీమంత్రి అశ్వనీకుమార్‌ రాజీనామా ప్రభావం కూడా కాంగ్రెస్‌ గెలుపుపై ఉండదన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటుందా అని అడుగగా అలాంటిదేమీ లేదని పైలట్‌ చెప్పారు. ప్రత్యేకించి గడచిన మూడు, నాలుగు మాసాలుగా సీఎం చన్నీ విద్యుత్‌, తాగునీరు, మధ్యతరగతికి ఇళ్ల నిర్మాణం, రైతులకు అనుకూలమైన అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని ప్రజలు స్వాగతించారని పైలట్‌ వివరించారు. గడచిన కొద్దికాలంగా చన్నీ చేపట్టిన చర్యలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయన్నారు. ఇక ప్రతిపక్షపార్టీల విషయానికి వస్తే…పంజాబ్‌లో దశాబ్దాల తర్వాత బహుముఖ పోటీ జరుగుతుందని, బీజేపీతో అమరేందర్‌సింగ్‌, అకాలీదళ్‌తో బీఎస్‌పీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నాయని, ప్రతిపక్షాలన్నీ చీలికలు, పీలికలుగా ఉన్నాయని పైలట్‌ వివరించారు. అందుకే ఇందులో ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సత్తాలేదని తాను భావిస్తున్నానన్నారు. ఏదో జరిగిపోతున్నట్లు ప్రతిపక్షాలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయని, కానీ ప్రజలు తమ ఓటును దుర్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా లేరని పైలట్‌ చెప్పారు. కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గట్టిగా చెప్పారు. పంజాబ్‌ సరిహద్దు రాష్ట్రం, వ్యూహాత్మకంగా అతి కీలకమైన రాష్ట్రమని వక్కాణించారు. సరిహద్దు రాష్ట్రాన్ని పాలించే అనుభవం ఇతర పార్టీలకు లేదని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img