Friday, April 19, 2024
Friday, April 19, 2024

కాలేజీల్లో టూరిజం క్లబ్‌లు

పర్యాటకంపై కేరళ సర్కారు దృష్టి
తిరువనంతపురం: పర్యాటకరంగం అభివృద్ధిపై కేరళ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. పర్యాటకరంగంలో విద్యార్థులను భాగస్వాములను చేయడంలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన కళాశాలల ఆవరణల్లో ‘టూరిజం క్లబ్‌’లను ఏర్పాటు చేస్తోంది. పర్యాటక, ఉన్నత విద్యామంత్రిత్వశాఖలు ఇందుకు చొరవ తీసుకున్నాయి. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి, కాలేజీల్లో టూరిజం క్లబ్బుల ఏర్పాటు, అందులో విద్యార్థులను భాగస్వాములను చేయడం గురించి పర్యాటకమంత్రి పీఏ మొహమ్మద్‌ రియాజ్‌, విద్యాశాఖమంత్రి ఆర్‌.బిందు మీడియాకు వివరించారు. మొదటి దశలో 25 కాలేజీల్లో టూరిజం క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, క్లబ్‌ల కార్యకలాపాల నిర్వహణ కోసం నిధులను పర్యాటకశాఖ అందిస్తుందని రియాజ్‌, బిందు తెలిపారు. కాలేజీ క్యాంపస్‌ క్లబ్‌లు సరికొత్త పర్యాటక ధోరణులకు మార్గం సుగమం చేస్తాయని, విద్యార్థుల సందర్శనకు, కాలేజీలలో టూరిజం క్లబ్‌ల పర్యటనకు ఆసక్తి కలిగిస్తాయని మంత్రి రియాజ్‌ చెప్పారు. విద్యార్థులలో భవిష్యత్‌ టూరిజం ప్రొఫెషనల్స్‌ను గుర్తించాలని యోచిస్తున్నామన్నారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని గొప్ప మార్కెట్‌ను తెచ్చిపెడతారని భావిస్తున్నామని పేర్కొన్నారు. సరికొత్త ఆలోచనలు, సృజనాత్మకతకు విద్యార్థులు పెద్దపీట వేస్తారని, పర్యాటకులను టూరిజం క్లబ్‌లకు రప్పించడానికి కృషి చేస్తారని వివరించారు. అంతేకాకుండా విద్యార్థులు పార్ట్‌టైమ్‌ టూరిజం గైడ్‌లుగానూ పనిచేయవచ్చని, సాంస్కృతిక కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారని మంత్రి వెల్లడిరచారు. తమ సొంత నైపుణ్యంతో విదేశీ విశ్వవిద్యాలయాలను సైతం విద్యార్థులు ఆకర్షించే పరిస్థితి ఉంటుందని పర్యాటకమంత్రి తెలిపారు. సరికొత్త పర్యాటక ఉత్పత్తులు గుర్తించేందుకు విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ చొరవ తీసుకుంటున్నామని మంత్రి బిందు చెప్పారు. పర్యాటకరంగం అభివృద్ధిలోనూ విద్యార్థులను భాగస్వాములను చేయడం సంతోషంగా ఉందన్నారు. పర్యాటకరంగం కేరళకు అత్యంత కీలకమన్న విషయాన్ని యువతలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img