Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేంద్రంపై ఐక్యపోరు

అఖిలభారత కిసాన్‌ సభ మహాసంగ్రామంలో రావుల వెంకయ్య

తిరువనంతపురం: ప్రజా`రైతు వ్యతిరేక విధానాలను నిరసనగా కేంద్రంపై ఐక్యపోరాటాన్ని సాగిస్తామని అఖిలభారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) తేల్చిచెప్పింది. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతలను తీవ్రంగా ఖండిరచింది. రైతులకు రుణవిముక్తి కల్పించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. శుక్రవారం కేరళ, తిరువనంతపురంలో రాజ్‌భవన్‌ వరకు రైతులు భారీ ప్రదర్శన నిర్వహించి కేంద్రప్రభుత్వ విధానాలు, మోసాలు, నిర్లక్ష్యానికి తమ నిరసన తెలిపారు. అఖిలభారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) సారధ్యంలో రాజ్‌భవన్‌ వద్ద రైతుల మహాసంగ్రామంలో వేలాది మంది అన్నదాతలు పాల్గొన్నారు. రైతులను రక్షించాలి, వ్యవసాయాన్ని రక్షించాలని నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక చర్యలను తక్షణమే ఉపసంహరణ, ఇచ్చిన హామీల అమలు, వ్యవసాయోత్పత్తి సబ్సిడీకి చట్టబద్ధ రక్షణ, కేంద్ర విద్యుత్‌ బిల్లును రద్దు, సహకార సంఘాన్ని తక్కువ చేసే కేంద్ర విధానాన్ని విడనాడాలి, రాష్ట్ర రైతు సంక్షేమ బోర్డు ఏర్పాటు, రైతులకు నెలసరి రూ.5వేల పింఛన్‌, రైతు రుణ ఉపశమన కమిషన్‌కు అవసరమైన నిధుల కేటాయింపునకు డిమాండ్‌ చేశారు. మహాసంగ్రామాన్ని ఏఐకేఎస్‌ అధ్యక్షుడు రావుల వెంకయ్య ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులను మోసం చేసిన మోదీ ప్రభుత్వంపై ఐక్య పోరాటాన్ని కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. అమృత కాలమని చెప్పి కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ సామాన్యులకు విష కాలాన్ని మోదీ ప్రభుత్వం తెచ్చిందని దుయ్యపట్టారు. కేంద్ర వ్యవసాయ బడ్జెట్‌ ఏటేట తగ్గుతోందన్నారు. దేశ జనాభాలో 62శాతంగా ఉన్న రైతులకు బడ్జెట్‌లో కేటాయించినది మూడు శాతమేనని చెప్పారు. రూ.45లక్షల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1,45,000 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఎరువుల సబ్సిడీ వంటి ప్రయోజనాలను రైతులకు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమానికి ఆఖిలభారత కిసాన్‌ సభ సంసిద్ధమవుతోందని, ఇందుకు ప్రతి రైతు నడుంబిగించాలని రావుల వెంకయ్య పిలుపునిచ్చారు. ఏఐకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలన్‌ నాయర్‌ అధ్యక్షత వహించిన సభలో ఏఐకేఎస్‌ జాతీయ కార్యదర్శి సత్యన్‌ మొకేరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.చమున్ని, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.రాధాకృష్ణన్‌, కిసాన్‌ సభ జిల్లా కార్యదర్శి వీపీ ఉన్నికృష్ణన్‌, రాష్ట్ర కార్యదర్శి కేవీ వసంత్‌ కుమార్‌ ప్రసంగించారు. ఏఐటీయూసీ, కేరళ మహిళా సంఘం, బీకేఎంయూ తదితర సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img