Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేంద్రం సహకరించలేదు : పెగాసస్‌ కేసులపై కమిటీ నివేదిక

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి అక్రమ నిఘా పెడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కోసం ఏర్పాటైన స్వతంత్ర కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను అత్యున్నత న్యాయస్థానం గురువారం పరిశీలించింది. దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఈ నివేదిక పేర్కొందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయితే మొబైల్‌ ఫోన్లలో పెగాసస్‌ స్పైవేర్‌ ఉన్నట్లు నిర్థరణ కాలేదని వివరించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సంస్థ రూపొంచిన నిఘా సాఫ్ట్‌వేర్‌ పెగాసస్‌ను ఉపయోగించి పాత్రికేయులు, రాజకీయ నేతలు, ఉద్యమకారులపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా నిఘా పెడుతోందని ఆరోపిస్తూ, దీనిపై స్వతంత్ర కమిటీ చేత దర్యాప్తు జరిపించాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం 2021 అక్టోబరులో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమర్పించిన నివేదిక మూడు భాగాల్లో ఉందని జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తెలిపింది. ఈ కమిటీ దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని మౌఖికంగా వ్యాఖ్యానించింది. ఈ కమిటీకి 29 ఫోన్లను సమర్పించారని, వాటిలో ఐదింటిలో మాల్‌వేర్‌ ఉన్నట్లు గుర్తించిందని తెలిపింది. అయితే అది పెగాసస్‌ ఔనా? కాదా? అనే విషయంలో స్పష్టత లేదని పేర్కొంది. ఈ ఫోన్లను సమర్పించినవారు నివేదికను బహిరంగంగా వెల్లడిరచవద్దని కోరినట్లు తెలిపింది. ఈ నివేదికలో కొంత భాగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడంపై పరిశీలిస్తామని తెలిపింది. ఈ నివేదికలో వ్యక్తిగత సమాచారం ఉండవచ్చునని, దీనిని రహస్యంగా ఉంచాలని కమిటీ చెప్పినట్లు తెలిపింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img