Friday, April 19, 2024
Friday, April 19, 2024

కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

హరియాణాలోని భివానీలో మైనింగ్‌ జోన్‌లో దుర్ఘటన
శిథిలాల కింద మరింతమంది ఉండవచ్చని అనుమానం

భివాని(హరియాణా) : ఇక్కడి దదమ్‌ మైనింగ్‌ ప్రాంతం వద్ద శనివారం కొండచరియ విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. కాగా శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తోషమ్‌ బ్లాక్‌లో ఉదయం 9 గంటల సమయంలో కొండ చరియ విరిగిపడటంతో శిథిలాల కింద ఆరు డంపర్‌ ట్రక్కులు, కొన్ని మెషిన్లు చిక్కుకుని ఉన్నాయని పోలీసులు తెలిపారు. హరియాణా హోం మంత్రి అనిల్‌ విజ్‌ మాట్లాడుతూ సహాయక చర్యల కోసం అనేక రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయని చెప్పారు. మృతుల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని విజ్‌ ట్వీట్‌ చేశారు. ‘హరియాణాకు చెందిన భివాని జిల్లాలో మైనింగ్‌ ప్రాంతం వద్ద జరిగిన ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఘజియాబాద్‌ నుంచి జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌), మధుబన్‌ నుంచి రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్‌డీఆర్‌ఎఫ్‌), హిసార్‌ నుంచి ఒక ఆర్మీ యూనిట్‌ను రప్పిస్తున్నాం. ఇప్పటి వరకు నలుగురు మరణించారు’ అని పేర్కొన్నారు. అంతకుముందు, భివాని ప్రధాన వైద్యాధికారి రఘువీర్‌ శాండిల్య మాట్లాడుతూ బీహార్‌కు చెందిన తూఫాన్‌ శర్మ (30, హరియాణాకు చెందిన జింద్‌ జిల్లాలోని బగన్‌వాలా నుంచి వచ్చిన బిందెర్‌ (23) ఈ దుర్ఘటనలో మరణించారని తెలిపారు. డీఎస్పీ (శివాని) మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ శిథిలాల కింద నలుగురు నుంచి ఐదుగురు వరకు చిక్కుకుని ఉంటారని చెప్పారు. అయితే కొంతమంది స్థానికులు మాత్రం కొండ చరియల కింద చిక్కుకున్న వారి సంఖ్య ఎక్కువేనని చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని ఏ అధికారి ధ్రువీకరించలేదు. ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మాట్లాడుతూ సహాయక చర్యలను వేగవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగంతో తాను మాట్లాడుతున్నానని అన్నారు. ‘భివాని వద్ద దదమ్‌ మైనింగ్‌ జోన్‌లో కొండ చరియ విరిగి పడిన ఘటన విషాదకరం. గాయపడిన వారికి తక్షణమే వైద్య చికిత్స అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని స్థానిక యంత్రాంగంతో మాట్లాడాను’ అని ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి జె.పి.దలాల్‌ పరిస్థితిని సమీక్షించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తోందని, ఘటనా స్థలం వద్దకు ఒక వైద్యుల బృందం చేరుకుందని చెప్పారు. కాగా ఖట్టర్‌ హయాంలో అక్రమ మైనింగ్‌ కొనసాగుతోందని కాంగ్రెస్‌ నాయకుడు రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా ఆరోపించారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే అక్రమ మైనింగ్‌ మాఫియాపై జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశిస్తారా అని కూడా ఆయన ట్వీట్‌లో ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img