Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కొవిడ్‌తో పోరాటంపై ప్రపంచదేశాలు భారత్‌ను ప్రశంసిస్తున్నాయి : ప్రధాని మోదీ

కొవిడ్‌తో పోరాటంపై భారత్‌ను ప్రపంచదేశాలు ప్రశంసిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. కరోనా లాంటి సంక్షోభాన్ని గత వందేళ్లలో ఎన్నడూ మానవాళి చూడలేదన్నారు. ఈ వైరస్‌ తన రూపాలను మార్చుకుంటూ, ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. భారత్‌తోపాటు యావత్‌ ప్రపంచం కూడా కరోనాపై పోరాటం చేస్తోందన్నారు. కొవిడ్‌ మొదలైన సమయంలో భారత్‌ ఏమవుతుందోనని అందరూ చర్చించారని, కానీ 130 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పట్ల ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ రాజ్యసభలో ప్రధాని మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సమాధానమిచ్చారు. సమాజంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలందరికీ కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఈ మహమ్మారి నుంచి బయట పడటం కోసం కొత్త విధానాలతో చర్యలు తీసుకోవచ్చుననే భరోసా కలిగిందన్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ సరుకులు ఇవ్వడం ద్వారా ప్రపంచానికి ఓ ఉదాహరణగా మన దేశం నిలిచిందన్నారు. భారత దేశంలోనే తయారైన వ్యాక్సిన్లను ఇస్తూ, కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ను అత్యధికంగా చేపట్టిన దేశంగా భారత దేశం నిలిచిందని తెలిపారు. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా మన పొరుగు దేశాలకు కూడా అందించినట్లు తెలిపారు.
మితమైన ద్రవ్యోల్బణం, ఘనమైన ఆర్థికాభివృద్ధిద్రవ్యోల్బణం యావత్తు ప్రపంచాన్ని కుదిపేస్తోందని చెప్పారు. 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయి ద్రవ్యోల్బణం అమెరికాలో ఉందని, 30 ఏళ్ళ గరిష్ఠ స్థాయిలో బ్రిటన్‌లో ఉందన్నారు. యూరో కరెన్సీ అమల్లో ఉన్న దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాము 2015-2020 మధ్య కాలంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నించామన్నారు. ఈ కాలంలో ద్రవ్యోల్బణం రేటు 4 శాతం నుంచి 5 శాతం వరకు ఉండేదన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యలో ఉండేదని చెప్పారు. నేడు మితమైన ద్రవ్యోల్బణం, అధిక వృద్ధి రేటు ఉన్న ఏకైక భారీ ఆర్థిక వ్యవస్థ భారత దేశమేనని చెప్పారు.
కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ అవకాశాలు పెరిగినట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ నుంచి రైతులకు మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. అది చాలా కీలకమైన నిర్ణయమన్నారు. దాని ఫలితంగా రికార్డు స్థాయిలో రైతులు పంటను పండిరచినట్లు తెలిపారు. కరోనా విపత్తు వేళ గణనీయంగా పంట ఉత్పత్తులు పెరిగాయన్నారు. 2017 తర్వాత ఐటీ రంగంలో 27 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పారు. కరోనా క్లిష్ట సమయంలో యువత దేశం గర్వపడేలా చేశారని, క్రీడా రంగంలో యువత రాణించినట్లు ఆయన తెలిపారు. మహమ్మారి ప్రభావం క్రీడలపై పడకుండా చూశారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img