Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరి..!

స్థానిక ప్రభుత్వాలు, సంఘాల నుంచి ఒత్తిడి
సర్వేలో తేలిన వైనం
న్యూదిల్లీ : దేశంలో కోవిడ్‌19 టీకా తీసుకోవడమనేది స్వచ్ఛందమే కానీ తప్పనిసరి కాదు. కానీ స్థానిక ప్రభుత్వాలు, కంపెనీలు, అసోసియేషన్‌లు కోవిడ్‌ నిరోధక టీకాను తీసుకోవడం తప్పనిసరి చేసినట్లు ఓ సర్వేలో తేలింది. డిజిటల్‌ కమ్యూనిటీ ఆధారిత ప్లాట్‌ఫాం ‘లోకల్‌ సర్కిల్స్‌’ ఇటీవల నిర్వహించిన సర్వేలో దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు తమ స్థానిక ప్రభుత్వం, కంపెనీలు, సంఘాలు టీకాను తప్పనిసరి చేశారని చెప్పారు. సర్వేకు దేశంలోని 328 జిల్లాల్లో నివసిస్తున్న పౌరుల నుంచి 36,000 పైగా స్పందనలు వచ్చాయి. 26 శాతం మంది తమ జిల్లాలోని స్థానిక ప్రభుత్వం, కొంతమంది లేదా నివాసితులందరికీ కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకోవడాన్ని తప్పనిసరి చేశారని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అక్టోబర్‌ 8న బాంబే హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ లో ‘కోవిడ్‌-19 టీకాలు వేయడం సామాజిక బాధ్యత.. అతి పెద్ద ప్రజా ప్రయోజనానికి సంబంధించినది’ అని పేర్కొంది. తమ ప్రాంతంలోని కాలనీ/సొసైటీ/మార్కెట్‌ వంటి సంఘాలు కోవిడ్‌-19 వాక్సిన్‌కు సంబంధించిన రుజువును చూపించడానికి యాక్సెస్‌ కోరుకునే కొంతమందికి లేదా అందరికీ టీకాను తప్పనిసరి చేశాయని 29 శాతం మంది చెప్పినట్లు సర్వే తెలిపింది. ఇక నలభై శాతం మంది వారి కుటుంబ యజమానులు కోవిడ్‌-19 టీకాను తప్పనిసరి చేశారని, మరో 13 శాతం మంది తమ యజమాని దానిని తప్పనిసరి చేశారని పేర్కొన్నారు. అయితే దాని గురించి స్పష్టంగా వివరించలేదు. సర్వేలో పాల్గొన్నవారిలో 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. వీరిలో 41 శాతం మంది టైర్‌1 ప్రాంతాలు, 35 శాతం మంది టైర్‌2, 24 శాతం మంది ప్రతివాదులు టైర్‌3, టైర్‌`4 ప్రాంతాలు, గ్రామీణ జిల్లాలకు చెందినవారు. సర్వే నివేదిక ప్రకారం.. నిర్దిష్ట ప్రయోజనాలను తిరస్కరించడంతోపాటు, వాక్సిన్‌ తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులు ప్రజలను నిర్బంధం చేయడం వంటి అనేక సందర్భాలున్నాయి. ఉదాహరణకు ఔరంగాబాద్‌ జిల్లా కలెక్టర్‌.. సరసమైన ధరల దుకాణాలు, గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ పంపుల నిర్వాహకులను కనీసం ఒక డోస్‌ కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకున్న పౌరులకు మాత్రమే సేవలందించాలని ఆదేశించినట్లు ప్రజలు నివేదించారు. అదేవిధంగా థానే మునిసిపల్‌ కార్పొరేషన్‌ మొదటి డోస్‌ సర్టిఫికేట్‌ను సమర్పించలేకపోయిన దాని ఉద్యోగులు, అధికారులు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు టీకాలు వేసే వరకు జీతాలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ‘లోకల్‌ సర్కిల్స్‌ గత 12 నెలల నుండి ప్రజల్లో వాక్సిన్‌ పై సందిగ్ధతను ట్రాక్‌ చేస్తోంది. అక్టోబరులో సందిగ్ధత కనిష్ఠ స్థాయికి చేరుకున్న తర్వాత, 7 కోట్ల మంది పెద్దలు మాత్రమే వాక్సిన్‌ వేయించుకోవడానికి సందేహించారని అంచనా వేయబడిరది. అయితే కొన్ని జిల్లాల్లో బలవంతంగా వాక్సిన్‌ వేసే కార్యక్రమం చేపట్టడం, మొత్తంగా కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గడంతో మళ్లీ ఈ సంఖ్య పెరగడం ప్రారంభమైంది’ అని లోకల్‌ సర్కిల్స్‌ వ్యవస్థాపకుడు సచిన్‌ తపారియా తెలిపారు. ‘కమ్యూనిటీ చర్చల నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ‘హర్‌ ఘర్‌ దస్తక్‌’, ఏదైనా ఇతర ప్రచారం ద్వారా, కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకోవడం గురించి ప్రజలను ప్రోత్సహించాలి, తెలియజేయాలి.. ఏ విధంగానూ బలవంతం చేయకూడదని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, జిల్లా పరిపాలనలకు స్పష్టం చేయాలి’ అని ఆయన చెప్పారు. వాక్సిన్‌ తీసుకోని పౌరులు టీకా తీసుకోకపోవడానికి పేర్కొన్న కీలక కారణాలతో సహా వాక్సిన్‌పై సందిగ్ధతకు సంబంధించిన తన తాజా డేటాను త్వరలో విడుదల చేయనున్నట్లు లోకల్‌ సర్కిల్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img