Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గిరిజనులు, దళితులు, పేదలను కేంద్రం విస్మరించింది


జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌

రాయ్‌పూర్‌ : కేంద్ర ప్రభుత్వం గిరిజనులు, దళితులు, పేదల సంక్షేమాన్ని విస్మరించిందని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ గురువారం విమర్శించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై కూడా మోదీ సర్కార్‌ను నిలదీశారు. వివిధ రాష్ట్రాల్లో నక్సల్స్‌ సమస్యకు ఆయా ప్రభుత్వాలు చేపట్టిన చర్యల కారణంగా తగ్గుముఖం పట్టిందని కూడా సోరెన్‌ చెప్పారు. ఐదు రోజుల ‘జాతీయ గిరిజన నృత్యోత్సవం’, ‘రాజ్యోత్సవ’ 2021 (రాష్ట్రావతరణ వేడుక) ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నగరంలో స్వామి వివేకానంద విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ఆయన ప్రశ్నించారు. ‘కేంద్ర నిర్ణయాలు రాజకీయ నాయకులపై మాత్రమే కాదు. సాధారణ పౌరులపైన కూడా ప్రభావం చూపుతాయి. అది ద్రవ్యోల్బణం, ఉపాధి లేదా దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి..?. వారి(కేంద్ర ప్రభుత్వ) ఆలోచనల్లో గిరిజనులు, దళితులు, వెనుకబడిన, మైనార్టీ వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజలకు స్థానం లేదని నేను భావిస్తున్నాను’ అని సోరెన్‌ తెలిపారు. నక్సలిజం జార్ఖండ్‌కే కాదని, దేశానిది అని అన్నారు. ‘మీరు గణాంకాలను చూసినట్లయితే, జార్ఖండ్‌లో నక్సల్స్‌ ఘటనలు క్రమంగా తగ్గుతున్నాయి. వివిధ ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా నక్సలిజం అదుపులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి భవిష్యత్తులో మేము మరింత మెరుగ్గా పని చేస్తాము’ అని ముఖ్యమంత్రి సోరెన్‌ చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌తో జార్ఖంఢ్‌ సరిహద్దులను పంచుకుంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, నక్సలిజం సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలోని ఛత్తీస్‌గఢ్‌లో విపక్ష బీజేపీని ఉద్దేశించి సోరెన్‌ వ్యాఖ్యానిస్తూ, ప్రతిపక్షం ఒక అర్థవంతమైన పాత్రను పోషించాలని అన్నారు. ప్రభుత్వ పనికి ఆటంకం కలిగించడం లేదా దానికి వ్యతిరేకంగా కుట్రకు ప్రయత్నించకూడదని అన్నారు. ఒక సానుకూల ప్రతిపక్షం ఉంటే, అప్పుడు అభివృద్ధి వేగంగా జరుగుతుంది’ అని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img