Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గుజరాత్‌ను ముంచెత్తిన వానలు

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. రహదారులు నీట మునగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనం అవస్థలు పడుతున్నారు. సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం వర్ష తీవ్రత తగ్గినప్పటికీ, వరదల కారణంగా అనుసంధాన రహదారులు మూసుకుపోవడం, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. 157 రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. వీటిలో జామ్‌నగర్‌ జిల్లాలో జాతీయ రహదారి సహా రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌, జునాగఢ్‌, భావనగర్‌, అమ్రేలి , సూరత్‌ జిల్లాల్లోని 17 రాష్ట్ర రహదారులు, గ్రామాలను కలిపే 127 పంచాయితీ రోడ్లు ఉన్నాయి. బుధవారం దక్షిణ గుజరాత్‌ సూరత్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో శనివారం ఉదయం వరకు వివిధ ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడిరచింది. రోజువారీ బస్సులను నడిపే 165 మార్గాలను మూసివేయడం వలన, 522 ట్రిప్పులు నడపలేమని రాష్ట్ర రవాణా సంస్థ తెలిపింది. వాటిలో ఎక్కువ భాగం జామ్‌నగర్‌, జునాగఢ్‌, రాజ్‌కోట్‌ జిల్లాలలో ఉన్నాయి. ఆది, సోమవారాల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మూడు ప్రధాన ఆనకట్టల నుంచి భారీగా నీరు నదుల్లోకి ప్రవహించడంతో రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌, పోర్‌బందర్‌ జిల్లాల్లోని 48 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వర్షాకాలంలో గుజరాత్‌ లో ఇప్పటివరకు వార్షిక సగటు వర్షపాతంలో 598.26 మి.మీ లేదా 72.22 శాతం వర్షపాతం నమోదైంది. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ మంగళవారం జామ్‌నగర్‌ నగరం , జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించారు. బాధితులకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img