Friday, April 19, 2024
Friday, April 19, 2024

గోవా నిరుద్యోగులకు రూ.3వేల భృతి

ఇంటికొకరికి ఉద్యోగం : స్థానికులకే 80శాతం ప్రైవేటు ఉద్యోగాలు
మైనింగ్‌`పర్యాటకం ఆధారిత కుటుంబాలకు రూ.5వేల సాయం
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేజ్రీవాల్‌ హామీలు

న్యూదిల్లీ : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించింది. ఆ ర్ఱాష్టాల్లో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గోవా రాష్ట్రానికి అనేక ‘ఎన్నికల’ హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే గోవాలోని నిరుద్యోగులకు రూ.3వేలు చొప్పున నెలసరి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మైనింగ్‌, టూరిజంపై ఆధారపడే కుటుంబాలకు ప్రతినెలా రూ.5వేలు చొప్పున అందిస్తామని, వారి ఉద్యోగాలను పునరుద్ధరించే వరకు ఆర్థికంగా ఆదుకుంటామని ప్రకటించారు. ప్రైవేటు ఉద్యోగాల్లో 80శాతం స్థానికులకు వచ్చేలా చూస్తామని, ఈ మేరకు కోటా కల్పిస్తామని హామీనిచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌పై విమర్శలు గుప్పించారు. గోవాలో ఇంటి వద్దకే సరకు రావాణా చేస్తుండటాన్ని దుయ్యబట్టారు. దిల్లీలో తాము చేస్తున్నదే సావంత్‌ గోవాలో చేస్తున్నారని, సొంత ఆలోచనలు లేవని విమర్శించారు. డ్యూప్లికేట్‌ ఎందుకు ఒరిజినల్‌కే ఓటు వేయండి అంటూ ఆప్‌ను గెలిపించాలని గోవా ప్రజలకు కేజ్రీవాల్‌ విన్నవించారు. గోవా ప్రజలకు గోవాలో 80శాతం ప్రైవేటు ఉద్యోగాలు దక్కేలా చట్టాన్ని తెస్తామన్నారు. ప్రతి ఇంటిలోని ఓ నిరుద్యోగికి ఉపాధి కల్పిస్తామని హామీనిచ్చారు. గోవాలో నిరుద్యోగుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరిందని, డబ్బు, పలుకుబడి ఉంటేనే ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. నిరుద్యోగ సమస్య అజెండాతో గోవా అసెంబ్లీ ఎన్నికలను ఆప్‌ ఎదుర్కోనున్నట్లు కేజ్రీవాల్‌ చెప్పకనే చెప్పారు. గోవాలో పర్యటించిన కేజ్రీవాల్‌ స్థానిక మపుసా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోవా కోసం విస్తృత ప్రణాళికను ఆప్‌ సిద్ధం చేస్తోందని తెలిపారు. గోవాలో ఉద్యోగాల గురించి ఏడు ప్రకటనలు చేస్తానని చెప్పారు. ఇదిలావుంటే, గోవాలో నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక ప్రచారాన్ని ఇటీవల ఆప్‌ ప్రారంభించిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img