Friday, April 19, 2024
Friday, April 19, 2024

గోవా విముక్తిపై చరిత్ర వక్రీకరణ

సరైన సమయంలోనే నెహ్రూ జోక్యం
మోదీ, అమిత్‌షాకు చరిత్ర తెలియదు
ఈసారి మా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించరు
గోవాలో విజయం మాదే
పీటీఐ ఇంటర్వ్యూలో చిదంబరం

న్యూదిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ చరిత్రను ఉద్దేశపూర్వకంగానే వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం విమర్శించారు. గోవా విముక్తికి భారతదేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సరైన సమయంలోనే జోక్యం చేసుకున్నారని స్పష్టంచేశారు. గోవాకు విముక్తి కలిగించడంలో నెహ్రూ తీవ్ర జాప్యం చేశారని మోదీ ఆరోపణలు చేయడాన్ని చిదంబరం తోసిపుచ్చారు. చిదంబరం శుక్రవారం పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు. నెహ్రూపై మోదీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గోవాలో ఏ ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను బీజేపీ లాక్కోలేదని చిదంబరం ధీమా వ్యక్తంచేశారు. ‘మా ఇల్లు సురక్షితంగా ఉంది. పటిష్టంగా కాపలా కాచుకోగలం. ఒకవేళ ఏదో విధంగా దొంగ ఇంట్లోకి చొరబడినా అలాంటి వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’ అని ఆయన అన్నారు. రోజులు గడిచే కొద్దీ ఓటర్లు ఓ స్పష్టతకు వస్తున్నారని, బీజేపీ లేదా కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోరని భావిస్తున్నారని, ఇందులో కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని చిదంబరం తెలిపారు. ఆమ్‌ఆద్మీపార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి చిన్న పార్టీలు బీజేపీ యేతర ఓట్లు చీల్చడానికే వచ్చినట్లు భావిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం పెద్ద సమస్యేమీ కాదని వ్యాఖ్యానించారు. నెహ్రూ కారణంగానే గోవా విముక్తిలో జాప్యం జరిగిందని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల చేసిన ఆరోపణలపై ప్రశ్నించగా చరిత్రను వక్రీకరించడం, తిరగరాయడానికి ఇదే ప్రయత్నమని ఆయన చెప్పారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ చరిత్ర గురించి మోదీ, అమిత్‌షాలకు ఏమీ తెలియదని, భారతదేశ స్వాతంత్య్రం తర్వాత చరిత్ర కూడా వారికి తెలియదని చిదంబరం చెప్పారు. ప్రత్యేకించి 19471960 మధ్యకాలం నాటి చరిత్ర అసలు అవగాహన లేదన్నారు. భారతదేశం శాంతికి చాంపియన్‌గా మారడానికి నెహ్రూ చేసిన కృషి మోదీ, షాలకు తెలియదన్నారు. అలీనోద్యమ సృష్టికర్త నెహ్రూ అని గుర్తుచేశారు. గోవాకు విముక్తి కల్పించే విషయంలో నెహ్రూ సకాలంలో జోక్యం చేసుకున్నారన్నారు. గోవా ప్రజల భవిష్యత్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణను సైతం ప్రతిపాదించి...వారి అభీష్టం మేరకే గోవాకు విముక్తి కల్పించారని వివరించారు. నెహ్రూకు, ప్రజాభిప్రాయానికి ధన్యవాదాలు. గోవా ఈరోజు స్వతంత్ర రాష్ట్రంగా ఉందంటే అది నెహ్రూ కృషేనని తెలిపారు. మోదీ, షా ఇప్పుడేమి చెప్పినప్పటికీ...చరిత్రను వక్రీకరించాలని కోరుకున్నప్పటికీ గోవాకు విముక్తి కల్పించడంలో నెహ్రూ గొప్ప పాత్ర గురించి గోవా ప్రజలు మర్చిపోలేరని చిదంబరం చెప్పారు. నెహ్రూ కోరుకుంటే 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని గంటల్లోనే గోవాకు విముక్తి లభించేదని, అయితే, మోదీ కారణంగా పోర్చుగీసు పాలకుల నుంచి గోవాకు విముక్తి లభించడానికి 15 ఏళ్లు పట్టిందని మోదీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. అమిత్‌షా సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. 1961 డిసెంబరు 19న పోర్చుగీసు చెర నుంచి గోవాకు విముక్తి లభించిన విషయం విదితమే. 1987 మే 30 వరకు గోవా, డయ్యూ డామన్‌ కేంద్ర పాలిత ప్రాంతంలో గోవా అంతర్భాగంగా ఉండేది. గోవా ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడేంత వరకూ కేంద్రపాలిత ప్రాంతమే. కాంగ్రెస్‌ తరపున గెలిచిన ఎమ్యెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయిగా అని అడుగగా ఈసారి తమ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోలేదని చిదంబరం స్పష్టంచేశారు. ‘మా ఇంటికి మంచి కాపలా ఏర్పాటు చేసుకున్నాం. దొంగ ఇంటి బయటి కాచుకొని ఉన్నాడని మాకు తెలుసు. అయితే, ఆ దొంగకు ఈసారి గోవా ప్రజలకు తగిన గుణపాఠం చెబుతారు. కాంగ్రెస్‌జీపీఎఫ్‌ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బహుముఖ పోటీ జరుగుతుందని, ప్రతిపక్ష ఓట్ల చీలిక ఓ కారణంగా కనిపించడం లేదా అని ప్రశ్నించగా గోవాలో అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా చిన్నవని, ఒక్కో నియోజకవర్గంలో 27 వేల ఓట్లు మాత్రమే ఉంటాయని, అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చిదంబరం తెలిపారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయని, కాంగ్రెస్‌ వైపు మెజారిటీ ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. పదేళ్ల బీజేపీ దుష్టపాలనకు చరమగీతం పాడాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. అందుకే కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నానన్నారు. ఆప్‌, టీఎంసీ వంటి చిన్న పార్టీలు బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి పనికొస్తాయన్నారు. ఆ పార్టీల అభ్యర్థులంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని వివరించారు. బీజేపీ స్థానంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి ఆప్‌, టీఎంసీకి లేదని ప్రజలకు తెలుసన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img