Friday, April 19, 2024
Friday, April 19, 2024

చిరాగ్‌ పాశ్వాన్‌.. తేజస్వీ యాదవ్‌ భేటీ

బీహార్‌లో రాజకీయ సమీకరణపై ఊహాగానాలు
పాట్నా : లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఎంపీ చిరాగ్‌ పాశ్వాన్‌, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌తో భేటీ కావడం.. బీహార్‌లో రాజకీయ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలకు తావిచ్చింది. సెప్టెంబర్‌ 12న తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మొదటి వర్థంతి కార్యక్రమానికి ఆహ్వానించేందుకు చిరాగ్‌ బుధవారం పాట్నాలోని తేజశ్వి యాదవ్‌ నివాసానికి వెళ్లారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఇద్దరు నేతలూ తమ తండ్రుల సన్నిహిత సంబంధాలు, సుదీర్ఘ అనుబంధం గురించి చెప్పారు కానీ రాజకీయంగా సహకరించుకునే విషయంపై సమాధానం దాట వేశారు. అయితే ఇద్దరూ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ‘మాకు పాత కుటుంబ సంబంధాలు ఉన్నాయి. మా నాన్న, లాలూ యాదవ్‌ చాలా సంవత్సరాలు కలిసి పనిచేశారు.. ఏదైనా కార్యక్రమంలో లాలూజీతో కలిసి పాల్గొనాలని నా తండ్రి కోరుకునేవారు’ అని పాశ్వాన్‌ విలేకరులతో అన్నారు. తాను వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి రేపు దిల్లీలో లాలూ యాదవ్‌ని కలవడానికి ప్రయత్నిస్తానని కూడా ఆయన చెప్పారు. నితీశ్‌ కుమార్‌తో కూడా భేటీ అవుతారా అని అడిగినప్పుడు, ఆయన అపాయింట్‌మెంట్‌ కోరినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని పాశ్వాన్‌ తెలిపారు. ‘నేను సమయం అడిగాను కానీ ముఖ్యమంత్రిని కలవడం అంత సులభం కాదు. ముఖ్యంగా నా విషయానికి వస్తే, అతను అపాయింట్‌మెంట్‌ ఇవ్వరు. కనీసం కార్యక్రమానికి ముందయినా ఆయన నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను’ అని పాశ్వాన్‌ వ్యాఖ్యానించారు. తేజశ్వి యాదవ్‌ మాట్లాడుతూ.. ‘మేము ఒక కుటుంబం.. 2010 లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు,మేము రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ నుండి చాలా నేర్చుకున్నాము. లాలూజీ ఆరోగ్యం సహకరిస్తే ఆయన కూడా హాజరవుతారు. పాశ్వాన్‌జీ మరణించినప్పుడు ఆయన చాలా బాధ పడ్డారు’ అన్నారు. నితీష్‌ కుమార్‌ని కలవాలనుకోవడంపై పాశ్వాన్‌ చేసిన వ్యాఖ్యలపై తేజస్వీ స్పందిస్తూ.. ‘ఇలాంటి సందర్భంలో ఎవరు సమయం అడిగినా వారికి ఇవ్వాలి’ అని నితీశ్‌ ఉద్దేశించి అన్నారు. పాశ్వాన్‌ చిన్నాన్న ఎల్‌జేపీలో చీలిక తెచ్చినప్పుడు తేజస్వీతో జట్టు కట్టాలని లాలూ చిరాగ్‌ పాశ్వాన్‌కు సూచించారు. దీనిపై అడగ్గా ఇద్దరూ రాజకీయ పొత్తుపై సమాధానం దాట వేశారు. ‘‘నేటి మా సమావేశంలో ఎలాంటి రాజకీయాల చూడరాదు.. నేను వ్యక్తిగతంగానే ఈ రోజు ఇక్కడకు వచ్చాను. భవిష్యత్తు గురించి రాజకీయ ప్రశ్నలకు ఇది సమయం కాదు’ అని పాశ్వాన్‌ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డీఏ)లో భాగమైన ఎల్‌జేపీ జూన్‌లో చీలిపోయింది. ఆరుగురు లోక్‌సభ ఎంపీలలో ఐదుగురితో కూడిన చీలిక వర్గానికి చిరాగ్‌ పాశ్వాన్‌ చిన్నాన్న పశుపతి పరాస్‌ నాయకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img