Friday, April 19, 2024
Friday, April 19, 2024

చైన్‌ లాగడంతో నది వంతెనపై ఆగిన రైలు

ప్రాణాలను పణంగా పెట్టిన లోకో పైలట్‌
ముంబై: కదులుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు చైన్‌ లాగడంతో ఒక నది వంతెనపై ఆగింది. దీంతో తిరిగి సెట్‌ చేసేందుకు రైల్వే లోకో పైలట్‌ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ముంబై నుంచి బీహార్‌లోని ఛాప్రాకు వెళ్తున్న గోదాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్‌ లాగాడు. దీంతో ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలోని టిట్వాలా, ఖడవలి మధ్యలో ఉన్న ఒక నది వంతెనపై ఆ రైలు ఆగింది. చైన్‌ లాగిన రైలు బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్‌ చేస్తేనే ఆ రైలు కదులుతుంది. కాగా, ఆ రైలు నదిపై వంతెన మధ్యలో ఆగింది. మరోవైపు ఎమర్జెన్సీ చైన్‌ లాగిన బోగి, రైలు ఇంజిన్‌కు చివరల్లో ఉంది. దీంతో ఆ బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్‌ చేసేందుకు సీనియర్‌ అసిస్టెంట్‌ లోకో పైలట్‌ సతీష్‌ కుమార్‌ చాలా రిస్క్‌ తీసుకున్నారు. రైలు ఇంజిన్‌లో ఉన్న ఆయన అతి కష్టం మీద చివరన ఉన్న రైలు బోగికి చేరుకున్నారు. అనంతరం తన ప్రాణాలను పణంగా పెట్టారు. నది వంతెనపై రైలు ఆగి ఉండటంతో ధైర్యం చేసి రైలు బోగి కిందకు వెళ్లి అక్కడ ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్‌ చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై స్పందించింది. అవసరం లేకుండా అత్యవసర చైన్‌ లాగితే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది. చైన్‌ లాగడంతో నది వంతెనపై ఆగిన గోదాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును తిరిగి సెట్‌ చేసేందుకు సీనియర్‌ అసిస్టెంట్‌ లోకో పైలట్‌ సతీష్‌ కుమార్‌ తన ప్రాణాలను పణంగా పెట్టారని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img