Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎంలకు ఎస్‌ఎస్‌జీ భద్రత ఉపసంహరణ

శ్రీనగర్‌ : నలుగురు మాజీ ముఖ్యమంత్రులకు, వారి 15 మంది కుటుంబ సభ్యులకు ప్రత్యేక భద్రతా గ్రూపు(ఎస్‌ఎస్‌జీ)ను ఉపసంహరిస్తూ జమ్ముకశ్మీర్‌ పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఈ నలుగురు సీఎంల్లో ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, గులామ్‌ నబీ అజాద్‌ ఉన్నారు. ‘జులై 18, 2021, సెప్టెంబర్‌ 19, 2021న జరిగిన భద్రతా సమీక్ష సమన్వయ కమిటీ(ఎస్‌ఆర్‌సీసీ)లో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు’ అని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి 31, 2020న జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక భద్రతా గ్రూప్‌ చట్టం2000కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరణ చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌కు చెందిన సిట్టింగ్‌ ముఖ్యమంత్రులు మాత్రమే ఎస్‌ఎస్‌జీ కలిగి ఉండటానికి అర్హులు అని ఆ వర్గాలు వివరించాయి. డిసెంబర్‌ 31, 2021న జమ్ముకశ్మీర్‌ హోం విభాగం నుంచి ఏడీజీపీ భద్రతకు పంపిన ఒక లేఖలో ఎస్‌ఎస్‌జీ ‘రైట్‌సైజ్‌’ ప్రతిపాదనను సంబంధిత అధికార మండలి ఆమోదించింది. ఎస్‌ఎస్‌జీ బలాన్ని ఒక కనిష్ఠ స్థాయికి తగ్గించాలని ఏడీజీపీ ఆదేశించింది. దీనిని కొనసాగించడానికి ఒక పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్‌ నేతృత్వం వహించడం ఉత్తమమని పేర్కొంది. సన్నిహిత సామీప్య బృందం(సీపీటీ) కోసం భద్రతా విభాగంలో తగినంత మంది సిబ్బందిని నియమించాలని కోరవచ్చు. ‘ఈ సిబ్బందికి ప్రస్తుతం ఉన్న విధంగా భత్యం (ప్రాథమిక వేతనంలో 25 శాతం) అందుకోవడం కొనసాగుతుంది’ అని ప్రకటన పేర్కొంది. మిగిలిన ఎస్‌ఎస్‌జీ సిబ్బంది వారి శిక్షణ నైపుణ్యాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ఇతర విభాగాలకు పంపిస్తారు. ‘ఎస్‌ఎస్‌ఎఫ్‌కు అవసరమైన వనరులు మినహా ఎస్‌ఎస్‌జీకి సంబంధించిన అన్ని వనరులు (వాహనాలు, యాక్సెస్‌ నియంత్రణ గాడ్జెట్‌లు మొదలైనవి) భద్రతా విభాగానికి బదిలీ చేయబడతాయి’ అని వివరించింది. 2000వ సంవత్సరంలో ఫరూక్‌ అబ్దుల్లా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు జమ్ముకశ్మీర్‌ శాసనసభ రూపొందించిన చట్టం ద్వారా ఎస్‌ఎస్‌జీ ఏర్పాటయింది. ఏప్రిల్‌ 24, 2002న హోం శాఖ కార్యాచరణ నిర్మాణం, చట్టం అమలుకు సంబంధించిన ఏర్పాట్లను ఆవిష్కరించింది. చట్టాన్ని అమలు చేయడానికి ముందు, అక్టోబర్‌ 1996లో జమ్ముకశ్మీర్‌ పోలీసు సీఐడీ విభాగం జారీ చేసిన నిబంధనలు, నిర్ధిష్ట నిర్వహణా విధానం ద్వారా మాజీ ముఖ్యమంత్రుల భద్రతను పర్యవేక్షించేవారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img