Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టీచర్లకు అందని వేతనం..

కరోనాతో ప్రైవేటు స్కూళ్ల ఆదాయానికి కోత
దేశవ్యాప్తంగా మెజార్టీ పాఠశాలల పరిస్థితి ఇదే

న్యూదిల్లీ : కరోనా మహమ్మారి అన్ని రంగాలను ధ్వంసం చేసింది. దీర్ఘ కాలంగా మూత కారణంగా దేశవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు జీతాలు అందక నానాయాతన పడుతున్నారు. కరోనా మొదటి, రెండవ దశల్లో వారు ఆర్థికంగా చితికిపోయారు. మెజార్టీ ప్రైవేటు పాఠశాలల ఆదాయంలో 20 నుంచి 25 శాతం మేర తగ్గుదలను నివేదించాయి. ఫలితంగా వాటిలోని ఉపాధ్యాయుల జీతాలకు కోత పడినట్లు కొత్త నివేదిక ఒకటి తెలిపింది. 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వ్యాప్తంగా 1,100 మందికి పైగా తల్లిదండ్రులు, పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన ఒక అధ్యయనం ఆధారంగా సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌(సీఎస్‌ఎఫ్‌) ఈ నివేదికను వెల్లడిరచింది. ఈ ఎన్‌జీవో సంస్థ దేశంలో నాణ్యమైన పాఠశాల విద్యపై పని చేస్తోంది. కాగా ఈ విద్యా సంవత్సరం కొత్త అడ్మిషన్లు భారీగా తగ్గాయని, మూడిరట నాలుగు వంతుల పాఠశాలలు ఆర్‌టీఈ రీయింబర్స్‌మెంట్‌లో జాప్యాన్ని ఎదుర్కొన్నాయని 55 శాతానికి పైగా పాఠశాలల నిర్వాహకులు తెలిపారు. మైనారిటీయేతర ప్రైవేట్‌ పాఠశాలలు 25 శాతం ఆర్‌టీఈ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విద్యార్థులకు ఉచిత ప్రవేశాలను అందించాలి. ఉచిత ప్రవేశాలకు బదులుగా, రాష్ట్రం ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. ‘చాలా స్కూళ్లకు 20 నుంచి 50 శాతం మేర ఆదాయం తగ్గింది. కానీ వాటి వ్యయాలు మాత్రమే అలాగే ఉన్నాయి. తద్వారా కార్యకలాపాలను కొనసాగించడం వాటికి కష్ట సాధ్యంగా మారింది. తల్లిదండ్రులు క్రమం తప్పకుండా ఫీజు చెల్లించకపోవడం వల్ల పాఠశాలల ఆదాయాలు దెబ్బతిన్నాయి. పట్టణ పాఠశాలల్లో ఇది అధికంగా ఉంది. ఈ విద్యా సంవత్సరం కొత్త ప్రవేశాలలో భారీగా తగ్గింపు ఉందని 55 శాతం పాఠశాలలు సూచిస్తున్నాయి’ అని నివేదిక వివరించింది. ఇదిలాఉండగా కొవిడ్‌19 సమయంలో పాఠశాలల రుణ ఆర్థిక సహాయం తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని, కేవలం మూడు శాతం మంది మాత్రమే రుణాలను పొందగలిగారు. ఐదు శాతం మంది రుణాల కోసం వేచి చూస్తున్నట్లు కనీసం 77 శాతం పాఠశాలల నిర్వాహకులు తెలిపారు. ‘ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో రుణం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్‌బీఎఫ్‌సీకు తక్కువగా ఉన్నారు’ అని నివేదిక పేర్కొంది. లాక్‌డౌన్‌ సమయంలో కనీసం 55 శాతం మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు వేతనంలో కోత ఎదుర్కొన్నారు. ‘పాఠశాలలు ఉపాధ్యాయులకు వేతనాలను పాక్షికంగా చెల్లించాయి. ఎందుకంటే ఇతర ఖర్చులు (బిల్లులు, అద్దె మొదలైనవి) నివారించలేము. తక్కువ ఫీజులు వసూలు చేసే పాఠశాలలు అరవై ఐదు శాతం ఉపాధ్యాయుల జీతాలను నిలిపివేయగా, అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలు 37 శాతం ఉపాధ్యాయుల జీతాలను నిలిపివేశాయి. కనీసం 54 శాతం మంది ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లేవు. 30 శాతం మంది తమ జీతాన్ని ప్రైవేట్‌ ట్యూటరింగ్‌, కోచింగ్‌తో భర్తీ చేశారు’ అని నివేదిక తెలిపింది. 55 శాతం మంది ఉపాధ్యాయులు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు తమ పాఠశాలలు కార్యకలాపాలను కొనసాగించగలరని చాలా నమ్మకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులు, తక్కువ ఫీజు పాఠశాల ఉపాధ్యాయులలో విశ్వాస స్థాయి గణనీయంగా తగ్గింది. ఫీజులు తగ్గిందేమీ లేదు.. తల్లిదండ్రుల విషయానికొస్తే.. 70 శాతం మంది పాఠశాల ఫీజులు అలాగే ఉన్నాయని నివేదించారు. 50 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే ఫీజు చెల్లించినట్లు తెలిపారు. ఇది విద్యా సంవత్సరంలో పాఠశాల ఆదాయంలో భారీ తగ్గింపును సూచిస్తుంది. ‘ఇరవై శాతం తల్లిదండ్రులు టెక్నాలజీ, మౌలిక సదుపాయాల కోసం పెరిగిన వ్యయాన్ని నివేదించారు. 15 శాతం మంది విద్యా ఖర్చులు పెరిగాయని నివేదించారు. ఇక 78 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల విద్యను ఒకే పాఠశాలలో కొనసాగించగలుగుతామని తెలిపారు’ అని ఈ కొత్త నివేదిక వివరించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలను గత ఏడాది మార్చిలో మూసివేసి, ఆన్‌లైన్‌ అభ్యాసానికి మార్పు చేశారు. అయితే గత ఏడాది అక్టోబరులో అనేక రాష్ట్రాలు పాఠశాలలను పాక్షికంగా తిరిగి తెరిచాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్‌19 రెండవ వేవ్‌ సమయంలో అవి మళ్లీ మూసివేయబడ్డాయి. అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు మళ్లీ తెరవడం ప్రారంభించగా, మరికొన్ని వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. విద్య రాష్ట్ర విషయంగా ఉన్నందున, విద్యా మంత్రిత్వ శాఖ మహమ్మారి సమయంలో పాఠశాల ఫీజులకు సంబంధించి ఎటువంటి ఆదేశం ఇవ్వలేదు. ఏదేమైనా, కొన్ని రాష్ట్రాలు ట్యూషన్‌ ఫీజులు తగ్గించాలని ఆదేశించడంతో తల్లిదండ్రులు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. యునిసెఫ్‌ నివేదిక ప్రకారం.. కొవిడ్‌`19 మహమ్మారి ఆర్థిక షాక్‌లు తక్కువ ఫీజులు కలిగిన ప్రైవేట్‌ పాఠశాలలు(ఎల్‌సీపీఎస్‌)ను దెబ్బతీశాయి. ‘ఎల్‌సీపీఎస్‌లు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురవడంతో ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోవడం, వారి జీతాలు తగ్గించుకున్నారని లేదా అసలు చెల్లించబడలేదని నివేదించారు. వేలాది ఎల్‌సీపీఎస్‌లు ఇప్పటికే మూతబడ్డాయి.
వేలాది మంది శాశ్వత మూసివేత అంచున ఉన్నారు. ఎల్‌సీపీఎష్‌ కూడా వారి విద్యార్థులకు రిమోట్‌ లెర్నింగ్‌ సపోర్ట్‌ అందించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తిరిగి వచ్చే విద్యార్థులలో విస్తృతమైన అభ్యాస నష్టాలు సంభవించే అవకాశం ఉంది’ అని ఇటీవల ఒక నివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img