Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

త్వరలో డిజిటల్‌ కరెన్సీ

న్యూదిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సోమవారం డిజిటల్‌ కరెన్సీపై ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. డిజిటల్‌ కరెన్సీని గుర్తించేలా ‘బ్యాంకు నోటు’ నిర్వచన పరిధిని విస్తరించాలని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి అక్టోబరులో ప్రతిపాదనలు అందినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ‘రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, 1934 చట్టం’లో సవరణలు చేయాలని సూచించినట్లు పేర్కొంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విపక్ష సభ్యులు క్రిప్టో కరెన్సీ నిషేధం, ‘సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)’ వంటి అంశాలపై ప్రభుత్వానికి ప్రశ్నలు స్పందించారు. అసలు సీబీడీసీని ప్రవేశపెట్టాలని ఏమైనా ప్రతిపాదనలు అందాయా? అని అడిగారు. అలాగే ఎలా అమలు చేయబోతున్నారో కూడా తెలియజేయాలని కోరారు. దీనికి కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి రాతపూర్వకంగా పై సమాధానం ఇచ్చారు. డిజిటల్‌ కరెన్సీ వినియోగానికి సంబంధించి ఆర్‌బీఐ ప్రస్తుతం పలు కేస్‌ స్టడీలను పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. అలాగే ఎలాంటి అంతరాయం లేకుండా సీబీడీసీని ప్రవేశపెట్టడానికి దశలవారీ అమలు వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ సీబీడీసీ వల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు. నగదుపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. అలాగే మరింత కచ్చితమైన, సమర్థవంతమైన, విశ్వసనీయమైన, నియంత్రిత, చట్టపరమైన చెల్లింపులకు అవకాశం ఉంటుందని తెలిపారు. నియంత్రించలేని క్రిప్టోకరెన్సీల వల్ల దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురికావొచ్చని పంకజ్‌ చౌదరి తన సమాధానంలో తెలిపారు. ‘క్రిప్టోకరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు 2021’ ఈ సమావేశాల్లో చర్చకు రానున్నట్లు లోక్‌సభ బులెటిన్‌లో ఇటీవల నోటిఫై అయిన విషయం తెలిసిందే. ప్రైవేటు క్రిప్టోకరెన్సీల నిషేధంతో పాటు డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే, క్రిప్టోకరెన్సీ-దాని వినియోగం వెనుక ఉన్న సాంకేతికతను ఉపయోగించుకునే విధంగా కొన్ని మినహాయింపులు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. డిసెంబరులో డిజిటల్‌ కరెన్సీ అధికారిక అమలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
బిట్‌కాయిన్‌ను గుర్తించాలనే ప్రతిపాదనలేమీ లేవు..
బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించాలన్న ప్రతిపాదనలేవీ ప్రభుత్వం వద్ద లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో తెలిపారు. అలాగే బిట్‌కాయిన్‌కు సంబంధించిన లావాదేవీల సమాచారాన్ని కూడా ప్రభుత్వం సేకరించబోదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img