Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దావూద్‌ అనుచరుల ఇళ్లల్లో సోదాలు

సలీమ్‌ ఫ్రూట్‌, ఖురేషీని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ
20 ప్రాంతాల్లో తనిఖీలు

ముంబై: మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, అతడి హవాలా ముఠా వ్యవహారాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ ముమ్మరం చేసింది. ముంబైలోని అతడి అనుచరుల ఇళ్లపై దాడులు చేపట్టింది. దావూద్‌ కోసం ముంబై కేంద్రంగా హవాలా వ్యాపారులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ క్రమంలోనే సోమవారం ముంబైలోని దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. బాంద్రా, బోరివలి, గోరేగావ్‌, పరేల్‌, శాంతాక్రూజ్‌ తదితర ప్రాంతాల్లో దావూద్‌ కంపెనీకి చెందిన హవాలా ఆపరేటర్లు, డ్రగ్‌ స్మగ్లర్లు, రియల్‌ ఎస్టేట్‌ మేనేజర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు జరిపింది. దావూద్‌కు చెందిన డీ-కంపెనీ హవాలా ఆపరేటర్లు, కీలక వ్యక్తులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఉగ్ర కార్యకలాపాల ద్వారా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఈ దాడుల నిమిత్తం దావూద్‌ ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దేశంలో ప్రముఖ రాజకీయ నేతల, వ్యాపారవేత్తలను వారు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగానే దావూద్‌ అనుచరుల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. అంతేగాక, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌కు డీ-కంపెనీతో ఉన్న సంబంధాలు, దావూద్‌ కుటుంబసభ్యులతో మాలిక్‌కు పరిచయాలున్నాయన్న ఆరోపణలపైనా ఎన్‌ఐఏ విచారణ జరుపుతోంది. ఈ దాడుల్లో భాగంగా దావూద్‌ అనుచరుడు సలీమ్‌ ఫ్రూట్‌ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్‌ ఛోటా షకీల్‌ బావమరిది ఖురేషీను అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖురేషీని మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్‌ కూడా ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img