Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దిల్లీలో రోడ్డెక్కని ఆటోలు, ట్యాక్సీలు

ప్రారంభమైన రెండ్రోజుల సమ్మె
సీఎన్‌జీపై సబ్సిడీ ఇవ్వాలని యూనియన్ల డిమాండ్‌
ప్రయాణీకులకు తప్పని ఇక్కట్లు

న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఆటోరిక్షా, క్యాబ్‌, ట్యాక్సీ యూనియన్‌ల రెండురోజుల సమ్మె సోమవారం ప్రారంభమైంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో సీఎన్‌జీ సబ్సిడీ, చార్జీలను సవరించాలని సమ్మెకు పిలుపునిచ్చిన భారతీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఫ్‌ులో భాగమైన ఆటో, ట్యాక్సీ అసోసియేషన్‌లు డిమాండ్‌ చేస్తున్నాయి. సమ్మె కారణంగా ఆటోలు, క్యాబ్‌లు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. ఓలా, ఉబర్‌ క్యాబ్‌ల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, వాటి చార్జీలు కూడా బాగా పెంచేశారని ప్రయాణీకులు వాపోయారు. రైల్వే స్టేషన్లు, ఇంటర్‌ స్టేట్‌ బస్‌ టెర్మినల్స్‌ (ఐఎస్‌బిటిలు), మెట్రో స్టేషన్‌లు వంటి రవాణా కేంద్రాల్లో ఆటోలు, క్యాబ్‌లు, ఫీడర్‌ బస్సులు అందుబాటులో లేకపోవడంతో సమ్మె ప్రభావం కనిపించింది. ఇతర రాష్ట్రాల నుంచి రైలు, బస్సు లేదా ఇతర మార్గాల ద్వారా దిల్లీకి వచ్చిన వారు సమ్మె వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు తమ డిమాండ్ల కోసం సివిల్‌ లైన్స్‌లోని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం దగ్గర ధర్నాకు దిగారు. కాశ్మీర్‌ గేట్‌, రాణి బాగ్‌, సివిల్‌ లైన్స్‌, న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌ ఆటో స్టాండ్‌తో సహా అనేక ప్రదేశాలలో చిన్నపాటి నిరసనలు జరిగాయి. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థకు అనుబంధంగా 90 వేల ఆటోలు, 80 వేలకు పైగా రిజిస్టర్డ్‌ ట్యాక్సీలు ఉన్నాయి. మాకు సీఎన్‌జీపై కిలోకు రూ. 35 సబ్సిడీ అందించాలి లేదా చార్జీలను పెంచాలని దిల్లీ ఆటో రిక్షా సంఫ్‌ు ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సోనీ పిటిఐకి తెలిపారు. ‘మా డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని మేము ప్రభుత్వాలకు (కేంద్రం, రాష్ట్రానికి) రెండు రోజుల అల్టిమేటం ఇస్తున్నాం… లేకుంటే మా సమ్మె నిరవధిక సమ్మెగా మార్చడం తప్ప మాకు వేరే మార్గం లేదు’ సర్వోదయ డ్రైవర్‌ అసోసియేషన్‌ నేత రవిరాథోర్‌ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img