Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దిల్లీ సీఎం ఇంట్లో ఆప్‌ ఎమ్మెల్యేల కీలక సమావేశం.. 12 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు..!

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత,దిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో గురువారం కీలక భేటీ జరుగనున్నది. సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరవగా.. దాదాపు 12 మంది శాసనసభ్యులు సమావేశానికి గైర్హాజరైనట్లు సమాచారం. వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తున్నది. ఆప్‌ ఎమ్మెల్యే దిలీప్‌ పాండే మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఎమ్మెల్యేలను సమావేశం సందర్భంగా సంప్రదించామని.. కొందరు స్పందించలేదన్నారు. ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 40 మంది ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.దిల్లీ అసెంబ్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 62 మంది సభ్యులున్నారు. వీరిలో ఇప్పటి వరకు ఎంత మంది సమావేశానికి హాజరయ్యారో తెలియరాలేదు. ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయగా.. చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం నివాసానికి చేరుకున్నారు. ఆప్‌ పీఏసీ బుధవారం సమావేశమైంది. ప్రభుత్వం తీసుకొచ్చి ఎక్సైజ్‌ పాలసీపై రాజకీయం దుమారం రేగుతున్న నేపథ్యంలోనే రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ జరిగింది. ఇదిలా ఉండగా.. ఈడీ, సీబీఐని దుర్వినియోగం చేస్తూ బీజేపీ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చీలికలు తెచ్చేందుకు కుట్ర పన్నుతోందని ఆప్‌ ఆరోపిస్తున్నది. చీలికలతో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని, ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలను సైతం ఆఫర్‌ చేస్తోందని ఆరోపించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img