Friday, April 19, 2024
Friday, April 19, 2024

దూసుకొస్తున్న ‘ఒమిక్రాన్‌’

దేశంలో 49కి చేరిన మహమ్మారి కేసులు
దిల్లీ, రాజస్థాన్‌ల్లో మరో నాలుగేసి నమోదు
మహారాష్ట్రలో మరో రెండు.. గుజరాత్‌లో నాలుగు

న్యూదిల్లీ : దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‘అత్యంత వేగంగా’ వ్యాప్తి చెందుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహమ్మారి కేసులు నమోదయ్యాయి. దిల్లీ, రాజస్థాన్‌లలో ఒమిక్రాన్‌ కొత్త కేసుల నమోదుతో దేశంలో కొత్త వేరియంట్‌ కేసులు 49కు చేరాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన గుజరాత్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి కరోనా పరీక్ష నిర్వహించగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. డిసెంబరు 3న దక్షిణాఫ్రికా నుండి కెన్యా, అబుదాబి మీదుగా దిల్లీకి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మొదటిసారి నిర్వహించిన పరీక్షలో కోవిడ్‌ నెగిటివ్‌ అని తేలింది. డిసెంబర్‌ 4న రెండవ పరీక్షలో కూడా ఆ వ్యక్తికి నెగిటివ్‌గా వచ్చింది. ఆ తర్వాత అతను కొంతకాలం ఆస్పత్రిలో ఐసోలేషన్‌ చేరారు. అయితే డిసెంబర్‌ 8న అతనికి కోవిడ్‌తో కూడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌తో పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. ఆ నమూనాను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపారు. ప్రస్తుతం అతను హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని బంధువులు, నలుగురు సహ ప్రయాణీకులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వారికి నెగిటివ్‌ వచ్చింది. కాగా సోమవారం మహారాష్ట్రలో కూడా రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. వారి ఇద్దరికీ దుబాయ్‌ వెళ్లి వచ్చారు. ఒమిక్రాన్‌ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశ రాజధానిలో కోవిడ్‌-19 వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు మరో నాలుగు నమోదయ్యాయి. వీరందరికీ విదేశీ ప్రయాణ చరిత్ర ఉందని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ మంగళవారం తెలిపారు. ‘ఇప్పటి వరకు రాజధానిలో ఆరుగురికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ అని తేలింది. వారిలో ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు’ అని జైన్‌ విలేకరులతో అన్నారు. కాగా ఇప్పటి వరకు 74 మంది ప్రయాణికులను విమానాశ్రయం నుండి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఇక్కడ ఒమిక్రాన్‌ అనుమానిత కేసులను వేరుచేయడానికి, చికిత్స చేయడానికి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 20 కేసులు, రాజస్థాన్‌ 9, కర్ణాటక 3, గుజరాత్‌ 4, కేరళ 1, ఆంధ్ర ప్రదేశ్‌ 1, కేంద్ర పాలిత ప్రాంతాలయిన దిల్లీలో 6, చండీగడ్‌లో ఒక కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించడంలో నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలు టీకా వేయించుకోవడంలో ఆలస్యం చేయవద్దని హెచ్చరించింది. ఇదిలాఉండగా, దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా కనుగొన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. ఈ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న బ్రిటన్‌లో తొలి మరణం నమోదయింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎంత ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది? ఇప్పటికే ఉన్న టీకాలు దానికి వ్యతిరేకంగా ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ వేరియంట్‌లో ప్రమాదకర మ్యూటేషన్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌పై ఆందోళన కొనసాగుతోంది.
55 శాతానికి పైగా పూర్తి వాక్సినేషన్‌
దేశ వయో జనాభాలో 55.52 శాతం ప్రజలకు టీకా రెండు డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే 88 శాతం మందికి ఒక్క డోసు మాత్రమే వేసినట్లు వివరించింది. ఇప్పుడు కోవిడ్‌పై పోరాటంలో భారతదేశం మరో మైలు రాయిని అధిగమించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img