Friday, April 19, 2024
Friday, April 19, 2024

‘దేశద్రోహం’పై 10న సుప్రీం విచారణ

కేంద్రం అఫిడవిట్‌కు అప్పటివరకు గడువు మంజూరు
చట్టబద్ధతపై పిటిషన్లను పెద్ద ధర్మాసనానికి సిఫార్సు యోచన

న్యూదిల్లీ : దేశద్రోహం చట్టం కాలం చెల్లిందన్న క్రమంలో దానిని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఈనెల10న విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని మరింత పెద్ద ధర్మాసనానికి సిఫార్సు చేసే యోచన చేస్తోంది. దీనిపై అఫిడవిట్‌ దాఖలుకు కేంద్రానికి తదుపరి విచారణ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇకపై వాయిదాలు ఉండబోవని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. మహారాష్ట్రలో హనుమాన్‌ చాలీసా వివాదం నేపథ్యంలో ఎంపీపై దేశద్రోహం కేసును అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ప్రస్తావించారు. కచ్చితమైన మార్గదర్శకాలతోనే చట్టం దుర్వినియోగాన్ని అరికట్టవచ్చునన్నారు. ఇదే క్రమంలో 1962లో కేదార్‌ నాథ్‌ కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ప్రస్తావిస్తూ కేసును ఐదుగురు లేదా ఏడుగురు జడ్జీల ధర్మాసనానికి సిఫార్సు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేదార్‌నాథ్‌ సింగ్‌ కేసులో ద్రేశద్రోహం చట్టం రాజ్యాంగబద్ధతను న్యాయస్థానం సమర్థించింది. ‘దేశంలో ఏం జరుగుతోంది మీకు తెలుసు. హనుమాన్‌ చాలీసా పఠించాలనుకున్న కారణంగా ఈ చట్టం కింద నిన్న ఎవరినో నిర్బంధించారు. కాబట్టి దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు అవసరం. కేదార్‌నాథ్‌ కేసులో తీర్పు ప్రకారం దీనిని పెద్ద ధర్మాసనానికి సిఫార్సు చేయనక్కర్లేదు’ అని వేణుగోపాల్‌ అన్నారు. మహారాష్ట్రలో ఎంపీ నవనీత్‌ రాణా, ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణాలపై హనుమాన్‌ చాలీసా వివాదం నేపథ్యంలో దేశద్రోహం కేసును అటార్నీ జనరల్‌ ప్రస్తావించారు. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. పెద్ద ధర్మాసనానికి సిఫార్సు అవసరం లేదని, 1962లో ఐదుగురి ధర్మాసనం తీర్పును విస్మరిస్తూ ప్రస్తుత పరిణామాలు, ప్రాథమిక హక్కులు, నాయశాస్త్రం ప్రకారం త్రిసభ్య ధర్మాసనం తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, ఈ వ్యవహారంలో పలు పిటిషన్లను విచారించిన ధర్మాసనం మంగళవారానికి విచారణను వాయిదా వేసింది. అంతకుముందు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేంద్రం తరపున అఫిడవిట్‌ దాఖలుకు కొంత సమయం కావాలని కోరగా న్యాయస్థానం అంగీకరించింది. సోమవారం నాటికి స్పందన తెలపాలని ఆయనకు సూచించింది. ఆ తర్వాత వాయిదాలు ఉండవని, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కేసు విచారణను తిరిగి చేపడతామని సీజేఐ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img