Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ధరల పెరుగుదలకు
బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణం

కాంగ్రెస్‌ నాయకుడు మనీశ్‌ తివారీ ధ్వజం

న్యూదిల్లీ : ధరల పెరుగుదలకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ నిందించింది. దాని విధానాలు దేశవ్యాప్తంగా 25 కోట్ల కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేశాయని, ధనవంతులు, పేదల మధ్య అంతరాన్ని పెంచాయని లోక్‌సభలో ఆరోపించింది. పొదుపు, పెట్టుబడి, ఉత్పత్తి, వినియోగం, ఉపాధి వంటి ఐదు మూల స్థంభాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చెడు విధానాలు నాశనం చేశాయని కాంగ్రెస్‌ సభ్యుడు మనీష్‌ తివారీ ఆరోపించారు. యూపీఏ హయాంలో 27 కోట్ల మందిని దారిద్య్ర రేఖకు ఎగువన తీసుకొచ్చారని, 2021లో బహిరంగంగా వెల్లడిరచిన నివేదికలో 23 కోట్ల మంది ప్రజలు మళ్లీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని అన్నారు. తివారీ ప్రకారం, ఈ సమయంలో భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 100 నుంచి 142కి పెరిగింది, అయితే అత్యల్ప శ్రేణిలో ఉన్నవారి ఆదాయం క్రమంగా పడిపోతోంది. దేశ సంపదలో 7 శాతం జనాభాలో 1 శాతం మంది వద్ద ఉండటం ‘దురదృష్టకరం’ అని, భారతదేశంలోని 92 మంది ధనవంతుల ఉమ్మడి సంపద 55 కోట్ల మంది భారతీయుల సంపదకు సమానమని ఆయన అన్నారు. మన దేశంలో ఇంతకంటే పెద్ద అసమానత మరొకటి ఉండదని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కోవిడ్‌-19 మహమ్మారి కారణమైనప్పటికీ, నవంబర్‌ 8, 2016న అధిక విలువైన కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే క్షీణించడం ప్రారంభించిందని తివారీ ఆరోపించారు. నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం జీఎస్‌టీని తీసుకువచ్చిందని, దీని వల్ల కనీసం 2.30 లక్షల చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలపైనే కాకుండా ఉపాధి రంగంపై కూడా ప్రభావం చూపాయని తెలిపారు. ‘అభివృద్ధి చెందిన దేశాల లీగ్‌లో చేరాలంటే, దేశంలోని అర్హతగల జనాభాలో మూడిరట రెండు మందికి ఉపాధి ఉండాలి. కానీ, భారతదేశంలో, ఈ రోజు కేవలం 40 కోట్ల మందికి మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి’ అని అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దేశంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 84 కోట్లకు పెరగాలని, అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వానికి ఎలాంటి వ్యూహం లేదని ఆయన అన్నారు. ‘మీరు పిండి, పెరుగు, పనీర్‌, పెన్సిల్‌, షార్పనర్‌పై జీఎస్‌టీని పెంచారు. మీరు పిల్లలను కూడా వదిలిపెట్టలేదు’ అని తివారీ విమర్శించారు. ‘స్మశాన వాటికల’పై విధించిన 18 శాతం జీఎస్‌టీ తనను బాధించిందని కాంగ్రెస్‌ నాయకుడు అన్నారు. ఇంధన ధరల పెంపుపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ… కేంద్రం తీసుకున్న పెట్రోలియం రంగంలో ‘పన్ను, ఎక్సైజ్‌ సుంకం, డివిడెండ్‌’ ద్వారా రూ.27 లక్షల కోట్లు తన ఖజానాను నింపడానికి కానీ సాధారణ ప్రజలకు ప్రయోజనాలను పంపిణీ చేయలేదని అన్నారు. ‘ప్రభుత్వం తన సొంత బడ్జెట్‌ను సరళీకృతం చేసి ఉండవచ్చు, కానీ దేశంలోని 25 కోట్ల కుటుంబాల జీవితాన్ని పూర్తిగా పాడు చేసిందని, ప్రతి గృహిణి కన్నీరుమున్నీరవుతోంది’ అని ఆయన ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img