Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ధరల పెరుగుదలపై 14 నుండి కాంగ్రెస్‌ ఆందోళన

15 రోజులపాటు దేశవ్యాప్త ఉద్యమం
‘జన్‌ జాగరణ్‌ అభియాన్‌’ పేరుతో పాదయాత్ర, సమావేశాలు

న్యూదిల్లీ : ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల సమస్యపై కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 14 నుండి దేశవ్యాప్త ఆందోళనను ప్రారంభించనున్నది. 15 రోజులపాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధరల పెరుగుదల జీవనోపాధిని ధ్వంసం చేస్తోందని, ప్రజల కష్టాలను మరింత పెంచుతున్నదని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం, తీవ్రస్థాయి మాంద్యం, ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ రేటు, వ్యవసాయ సంక్షోభం, పేదరికం, ఆకలి స్థాయిలు పెరగడానికి ఇది కారణమయ్యిందని తెలిపారు. ధరల పెరుగుదలపై కేంద్రంలోని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సూర్జేవాలా ధ్వజమెత్తుతూ, మోదీ ప్రభుత్వం అత్యంత ఖరీదైన పాలనగా నిరూపించుకుందని అన్నారు. వేణుగోపాల్‌ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో ఆవాలు, ఇతర వంటనూనెల ధరలు రెట్టింపు అయ్యాయి. సీజనల్‌ కూరగాయల ధరలు నెలలో 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయని అన్నారు. అలాగే గత ఏడాది కాలంలో సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర 50 శాతం పెరిగి రూ.900 నుంచి రూ.1,000కి చేరుకుంది. అదేవిధంగా, గత 18 నెలల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రూ.34.38, 24.38 పెరిగి లీటర్‌కు రూ.103.97, రూ.86.67కు చేరాయని ఆయన వివరించారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మునుపెన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం, ఉద్యోగాల నష్టం సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందని ఆయన అన్నారు. ఒక్క కోవిడ్‌ కాలంలోనే 14 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారని, కోట్లాది మంది రోజువారీ కూలీలు 50 శాతం వరకు జీతాల కోతను ఎదుర్కొన్నారని, నిరుద్యోగిత రేటు ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయి 8-9 శాతానికి చేరిందని తెలిపారు. అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ తాజా నివేదిక ప్రకారం), కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ తన 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో 27 కోట్ల మంది భారతీయులను ‘దారిద్య్ర రేఖకు దిగువన’ (బిపిఎల్‌) నుండి విముక్తి కలిగించగా, గత రెండేళ్లలో మోదీ ప్రభుత్వం 23 కోట్ల మంది భారతీయులను దారిద్య్ర రేఖకు దిగువకు నెట్టివేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘జన్‌ జాగరణ్‌ అభియాన్‌’ పేరుతో చేపట్టిన ఈ ఆందోళన సందర్భంగా, వంట గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌, వంట నూనె, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజల వాణిని బలపరిచేందుకు పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఏఐసీసీ ‘జన్‌ జాగరణ్‌ అభియాన్‌’ లోగోను, ధరల పెరుగుదల, దాని పర్యవసానాల గురించి వాస్తవాలతో కూడిన కరపత్రాన్ని, ప్రజల ప్రస్తుత ఇబ్బందులకు సంబంధించిన ప్రశ్నావళిని విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు వారం రోజుల పాటు ‘పాదయాత్ర’ (మార్చ్‌) నిర్వహించి ప్రజలతో చర్చించేందుకు గ్రామాలు, పట్టణాలు లేదా నగరాల్లో రాత్రి బసలు నిర్వహిస్తారని అన్నారు. ‘పాదయాత్ర’ ప్రతిరోజూ ఉదయం ‘ప్రభాత్‌ భేరి’ (ఉదయం వేళ)తో ప్రారంభమవుతుంది. తర్వాత ‘శ్రమదాన్‌’ (సమాజానికి స్వచ్ఛంద సహకారం), పరిశుభ్రత కార్యక్రమం చేపడతారు. ‘పాదయాత్రి’లు ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల జీవితాలపై ఏ విధంగా ప్రతికూల ప్రభావం చూపుతుందో వివరించేందుకు వారితో చిన్నచిన్న సమావేశాలు నిర్వహిస్తారు. ‘జన్‌ జాగరణ్‌ అభియాన్‌’కు సంబంధించిన సమస్యలపై నిర్దిష్ట ప్రాధాన్యతతో మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌, వార్ధాలో నవంబర్‌ 12 నుండి 15 వరకు రాష్ట్ర స్థాయి శిక్షకులకు ఏఐసీసీ శిక్షణా శిబిరం కూడా నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయి శిక్షకులు పార్లమెంట్‌, అసెంబ్లీ, సెక్టార్‌ స్థాయిలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని దిగ్విజయ్‌ సింగ్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img