Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ధూళి తుపానులతో భారత్‌లో అధిక వర్షపాతం?

ఐఐటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
న్యూదిల్లీ: వాతావరణ మార్పులతో మధ్యప్రాచ్యంలో తరచూ సంభవిస్తున్న ధూళి తుపానుల కారణంగా వర్షాకాలంలో భారతదేశంలో వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) భువనేశ్వర్‌ పరిశోధకుల అధ్యయనం ఈ మేరకు వెల్లడిరచింది. క్లైమేట్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌ జర్నల్‌లో ఇటీవల ఈ అధ్యయనం ప్రచురితమైంది. మధ్యప్రాచ్య ఎడారుల నుండి వెలువడే ధూళి… అరేబియా సముద్రానికి మళ్లడం వల్ల దక్షిణాసియాలో ముఖ్యంగా భారత ప్రాంతంలో ప్రత్యేకించి తీవ్రమైన కరువు పరిస్థితిలో స్వల్పకాలిక వర్షపాతం పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ఎడారుల నుండి వెలువడే ధూళి కణాలు భారతదేశంపై ఒకటి లేదా రెండు వారాల వ్యవధిలో వర్షపాతాన్ని పెంచుతాయని మునుపటి అధ్యయనం వెల్లడిరచింది. అరేబియా సముద్రం మీద ఈ ధూళి ప్రేరేపించిన వేడి వాతావరణం వల్ల ఇది సాధ్యమైంది. ఇది భారత ప్రాంతం వైపు గాలులు, తేమను వేగవంతం చేయడానికి శక్తి వనరుగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎల్‌నినోతో సంబంధం ఉన్న కరువు సంవత్సరాలలో ఈ బంధం బలంగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఎల్‌నినో, లా నినా పసిఫిక్‌ మహాసముద్రంలో వాతావరణ నమూనాలు… ఇవి ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ‘కొనసాగుతున్న వాతావరణ మార్పుల కారణంగా భారతదేశం కరువులు లేదా వర్షపాత లోటును ఎదుర్కొంది. మార్పులను ఎదుర్కొంది’ అని ఐఐటీ భువనేశ్వర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎర్త్‌ ఓషన్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్సెస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వి.వినోజ్‌ పేర్కొన్నారు. అయితే గ్లోబల్‌ వార్మింగ్‌, మారుతున్న గాలి నమూనాలతో రాబోయే సంవత్సరాల్లో మధ్యప్రాచ్య ఎడారులలో ధూళి తుఫానులు పెరిగి, ఈ ధూళి అనుకూల పరిస్థితులలో అరేబియా సముద్రానికి రవాణా చేయబడవచ్చునని, దీంతో భారత ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వినోజ్‌ అన్నారు. భవిష్యత్తులో భారతదేశంలో వర్షపాతం యొక్క మారుతున్న లక్షణాలను అర్థం చేసుకోవడంలో ఈ ధూళి-ప్రేరిత ప్రభావం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img