Friday, April 19, 2024
Friday, April 19, 2024

నాకు పాఠాలు చెబుతారా..!

12 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేసేదే లేదు..
విపక్ష నేత విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోను..
తేల్చిచెప్పిన రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు
సభనుంచి కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీల వాకౌట్‌

న్యూదిల్లీ : విపక్ష సభ్యుల తీవ్ర నిరసన మధ్య గత పార్లమెంటు సమావేశాల్లో ‘అవిధేయం’గా ప్రవర్తించారని ఆరోపిస్తూ 12 మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ నుండి సస్పెండ్‌ చేయడాన్ని బీజేపీ మంగళవారం గట్టిగా సమర్థించుకుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొత్తానికి 12 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు మంగళవారం సమర్థించుకున్నారు. దీంతో కాంగ్రెస్‌, వామపక్షాలు సహా ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎం.మల్లికార్జున ఖార్గే చేసిన విజ్ఞప్తిని వెంకయ్య నాయుడు తోసిపుచ్చుతూ, ఆగస్టులో జరిగిన మునుపటి సమావేశాల్లో వారు సభను అపవిత్రం చేసినందుకు ఎటువంటి పశ్చాతాపం చూపలేదని అన్నారు. ‘12 మంది ఎంపీల సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, అది ఆమోదం పొందింది. చర్యలు తీసుకున్నాం. ఇది చివరిది’ అని అన్నారు. సస్పెండ్‌ అయిన ఎంపీలు ఎటువంటి పశ్చాతాపాన్ని ప్రదర్శించలేదని, అందుకే ఖార్గే విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదని చైర్మన్‌ చెప్పారు. ‘మీరు సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. సభకు అంతరాయం కలిగించారు. మీరు టేబుల్‌పై ఎక్కి సభాధ్యక్ష స్థానం పైకి పేపర్లు విసిరారు. కొంతమంది టేబుళ్లపై ఎక్కి నాకు పాఠాలు చెప్పారు. అది మార్గం కాదు’ అని వెంకయ్య నాయుడు అన్నారు. ‘ప్రతిపక్ష నాయకుడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం విలువైనదని నేను అనుకోను. నేను దానిని అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదు’ అని తెలిపారు. మంగళవారం సభ సమావేశమవగానే ప్రతిపక్ష నేత ఖార్గే ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని తెలిపారు. గత సమావేశాల్లో అవిధేయంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో చర్యలు తీసుకున్నారని అన్నారు. సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు సభాధ్యక్ష స్థానం సభ్యుల పేర్లను ప్రకటించాలని, కానీ నవంబరు 29న ప్రభుత్వం 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అలా జరగలేదని ఖార్గే తెలిపారు. రాజ్యసభ సంప్రదాయాల ప్రకారం ఎల్లప్పుడూ అనుమతించే పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ను సభాధ్యక్షుడు సోమవారం అనుమతించలేదని చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు ఎంపీలు, తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన నుంచి ఇద్దరేసి, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున సస్పెండ్‌ అయ్యారు. గత సమావేశాల్లో చేసిన పనులపై, తీసుకున్న చర్యలపై ఖార్గే చేసిన వాదనలను చైర్మన్‌ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. రాజ్యసభ ఒక ‘కొనసాగించే సంస్థ’ అని, 256, 259, 266 నిబంధనల ప్రకారం సభ్యులను సస్పెండ్‌ చేసే అధికారం సభ చైర్మన్‌కు ఉందని తెలిపారు. ఆగస్టు 10న కొన్ని అంశాలపై చర్చించాలని కోరుతూ విపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టించడంతో సభాపతి సభ్యుల పేర్లను చెప్పారని ఆయన అన్నారు. ‘చైర్మన్‌ చర్య తీసుకోవచ్చు. సభ కూడా చర్య తీసుకోవచ్చు. నిన్న (నవంబర్‌ 29) ఏం జరిగిందంటే చైర్మన్‌ చర్యలు తీసుకోవడం కాదు. సభ తీర్మానం చేసిన తర్వాత చర్యలు తీసుకున్నాం’ అని తెలిపారు. అయితే జోషి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ వాయిస్‌ ఓటింగ్‌ ద్వారా తీర్మానాన్ని ఆమోదించి చర్య తీసుకుందని వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యపై ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆగస్టు 10న సభా కార్యక్రమాలను పరిశీలించండి. డిప్యూటీ చైర్మన్‌ (అధ్యక్షుడు) అనేక సార్లు విజ్ఞప్తులు చేశారు. తర్వాత (రాజ్యసభ) బులెటిన్‌లో కూడా ఈ చర్యకు పాల్పడిన వ్యక్తుల గురించి ప్రచురించబడిరది’ అని చైర్మన్‌ వివరించారు. నవంబర్‌ 29న సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ను లేవనెత్తడానికి తనను అనుమతించలేదని ఖార్గే చేసిన ఆరోపణలను నాయుడు ప్రస్తావించలేదు. సభ చైర్మన్‌ రూలింగ్‌తో సంతృప్తి చెందని కాంగ్రెస్‌, ఆప్‌, ఆర్జేడీ, వామపక్షాలు సహా ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపాయి. అయితే వెంకయ్య నాయుడు వాటిని అనుమతించకుండా జీరో అవర్‌ను కొనసాగించారు. దీంతో విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ప్రతిపక్షాన్ని కాదు.. కానీ ట్రెజరీ బెంచ్‌లకు చెందిన 80 మంది ఎంపీలు గత వర్షాకాల సెషన్‌లో కొన్ని చర్చలను అడ్డుకున్నందున వారిని సస్పెండ్‌ చేయాలని తమ నాయకుడు డెరెక్‌ ఓబ్రెయిన్‌ చెప్పిన కొద్దిసేపటి తర్వాత టీఎంసీ సభ్యులు కూడా వాకౌట్‌ చేశారు. అంతకుముందు, ఖార్గే మాట్లాడుతూ ‘తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానిని ఆమోదించడం నిబంధన 256 కింద అందించిన సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించి విధివిధానాలను పూర్తిగా ఉల్లంఘించడమే. అయితే పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ని లేవనెత్తడానికి నాకు అనుమతి లేదు. ఇది గౌరవప్రదమైన పార్లమెంటరీ సమావేశాల సమయాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే’ అని ఆయన అన్నారు. ‘ప్రస్తుత సందర్భంలో 12 మంది సభ్యులలో ఎవరి పేరు కూడా ఆ రోజున పేర్కొనబడలేదు. అవిధేయంగా ప్రవర్తించారని ఆరోపించిన సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత సభ్యులను సస్పెండ్‌ చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం సరైనది కాదు. అప్రజాస్వామిక చర్య. నిబంధనలను ఉల్లంఘించడమే’ అని స్పష్టం చేశారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ‘మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను సార్‌… మేమంతా సభకు వచ్చాం. దానిని రద్దు చేయమని మేము మిమ్మల్ని అభ్యర్థించాం. అది సెలెక్టివ్‌గా జరిగింది. దీంతో ఎలాంటి సంబంధం లేని కొందరు సభ్యులున్నారు. ఈ సంఘటన గత సమావేశాల్లో జరిగింది. మీరు దీనిపై ఎలా చర్య తీసుకుంటారు’ అని అన్నారు. అంతకుముందు రోజు 16 ప్రతిపక్ష పార్టీల నేతలు వెంకయ్య నాయుడిని కలిసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆగస్టు 10న జరిగిన ఘటనలో 33 మంది సభ్యులు ఉన్నారని, వీరిలో 12 మందిని సస్పెండ్‌ చేశామన్నారు. చైర్మన్‌గా ఎవరిపైనా చర్యలు తీసుకోవడం, ఎవరిపైనా వ్యాఖ్యానించడం సంతోషంగా లేదని, అదే సమయంలో సభను నిర్వహించడం తన పవిత్ర కర్తవ్యమని అన్నారు. ‘మీరు ఇదే ధోరణిని కొనసాగిస్తే దేశానికి, వ్యవస్థకు చాలా హానికరం. వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుంది’ అని అన్నారు. ప్రభుత్వాన్ని రక్షించడానికి తాను ఇక్కడకు రాలేదని, సభ్యులు పార్లమెంటును కించపరచకుండా, ప్రజలను కించపరచకుండా చూడాలని వెంకయ్య నాయుడు తెలిపారు.
ఎంపీలు క్షమాపణ చెబితే తప్ప క్షమించలేరు : గోయల్‌
రాజ్యసభలో సభా నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌.. సభ్యులు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌ను తిరస్కరించిన రాహుల్‌ గాంధీపై విరుచుకుపడ్డారు. సభలో మహిళా మార్షల్స్‌పై దాడి చేయడం వంటి చర్యలను కాంగ్రెస్‌ నాయకుడు ఆమోదిస్తారా, వారి చర్యను సమర్థిస్తారా అని గోయల్‌ పార్లమెంటు హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కాగా ఈ సభ్యులు పార్లమెంట్‌లో ‘ప్రజల గొంతుకను పెంచినందుకు’ క్షమాపణ చెప్పరని పేర్కొంటూ రాహుల్‌ గాంధీ ఒక ట్వీట్‌ చేశారు. గోయల్‌ ఈ 12 మంది సభ్యులు అవిధేయంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ, సభాధ్యక్ష స్థానం పైకి కాగితాలు చింపివేయడం నుండి పుస్తకాలు విసిరివేయడం, మహిళా మార్షల్స్‌పై ఆరోపణపై దాడి చేయడం జరిగిందని అన్నారు. వారు క్షమాపణలు చెప్పకపోతే వారి చర్య క్షమించబడదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img