Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

నూనె ధరల భారం మరో మూడు నెలలు

కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అంచనా
న్యూదిల్లీ: వచ్చే డిసెంబరు నుంచి వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. ఇప్పుడు సాగులో ఉన్న పంటలు చేతికి రానున్నందున ఏడాది అంతానికి అంతర్జాతీయంగా నూనె ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. ఇప్పటికే ఫ్యూచర్‌ మార్కెట్‌లో వంట నూనెల రేట్లు తగ్గాయనీ, గిరాకీ ఇంకా భారీ స్థాయిలోనే ఉన్నందున తగ్గింపు భారీ స్థాయిలో ఉండకపోవచ్చునని తెలిపారు. దేశీయంగా వంటనూనెల ధరలు పెరగడానికి గల కారణాలను పాండే వివరించారు. నూనె గింజల పంట సాగు అధికంగా ఉన్న దేశాల్లో బయోఫ్యూయల్‌ పాలసీలు తీసుకురావడం ధరలపై ఒత్తిడి పెంచిందని వివరించారు. పామాయిల్‌ పంట అధికంగా పండే మలేసియా, ఇండోనేసియా దేశాలు పామాయిల్‌ను బయోఫ్యూయల్‌గా వినియోగించాలని నిర్ణయించాయి. అమెరికా సోయాబీన్‌ను బయోఫ్యూయల్‌ తయారీలో వినియోగిస్తోంది. భారత మార్కెట్లో పామాయిల్‌ది 30-31 శాతం వాటా కాగా.. సోయాబీన్‌ ఆయిల్‌ మార్కెట్‌ వాటా 22 శాతంగా ఉంది. దేశీయ వంటనూనెల అవసరాల్లో దాదాపు 60 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ప్రభుత్వ చొరవ వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరల ప్రభావం పూర్తిగా భారత్‌పై పడలేదని పాండే తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో సోయాబీన్‌ నూనె ధర 18 శాతం, పామాయిల్‌ ధర 22 శాతం పెరిగితే.. భారత్‌లో మాత్రం ఈ పెరుగుదల 2 శాతానికే పరిమితమైందన్నారు. దిగుమతి సుంకాల్ని తగ్గించడం వంటి చర్యలతో ప్రభుత్వం ధరల్ని నియంత్రించే ప్రయత్నం చేసిందన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ఏడాది కాలంలో కిలో పామాయిల్‌ ధర 64 శాతం పెరిగి రూ.139, సోయాబీన్‌ ధర 51.21 శాతం ఎగబాకి 155కి పెరిగింది. కిలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర 46 శాతం పెరిగి 175కు చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img