Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

పార్టీని వీడిన కేంద్ర మాజీమంత్రి అశ్వనీకుమార్‌
చండీగఢ్‌: పంజాబ్‌ ఎన్నికలు ముంగిటనున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నేత, కేంద్రన్యాయశాఖ మాజీ మంత్రి అశ్వనీకుమార్‌ మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్‌తో తనకున్న 46 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికారు. జాతీయ ప్రయోజనాల కోసం పార్టీ వెలుపలే ఉత్తమంగా సేవ చేయగలనని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నా గౌరవానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాను. జాతీయ ప్రయోజనాల కోసం పార్టీ వెలుపలే ఉత్తమంగా సేవ చేయగలను. పార్టీతో నా 46 సంవత్సరాల అనుబంధానికి ముగింపు పలుకుతున్నాను. స్వాతంత్య్ర సమరయోధులు ఊహించిన ఉదార ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తాను’ అని రాజీనామా లేఖలో అశ్వనీ కుమార్‌ పేర్కొన్నారు. అశ్వనీకుమార్‌ 2002 నుంచి 2014 వరకు వరుసగా మూడు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2012 అక్టోబరు 28 నుంచి 2013 మే 10 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. ఇటీవల సీనియర్‌ నేత ఆర్‌పీఎన్‌ సింగ్‌ కాంగ్రెస్‌ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఈ రాజీనామాకు ప్రాధాన్యం సంతరించుకుంది.
స్ఫూర్తిదాయక నాయకత్వం లేదు
అశ్వనీకుమార్‌ పీటీఐతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో స్ఫూర్తిదాయక నాయకత్వం లోపించిందన్నారు. పార్టీ క్షేత్రస్థాయితో సంబంధాలు కోల్పోయిందని చెప్పారు. ప్రస్తుతం అస్థిత్వ సవాలునెదుర్కొంటోందని కుమార్‌ చెప్పారు. పార్టీ పతనమైనప్పటికీ తనను తాను ఆవిష్కరించుకోవడంలో విఫలమైందని స్పష్టం చేశారు. ఇండియా గేట్‌ వద్ద నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం, పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్‌ అవార్డుపై ఇటీవలి వివాదాలు చోటుచేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రశ్నకు సమాధానంగా…
కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను అవమానించి బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిన తీరు అశుభ సంకేతమన్నారు. రాబోయే ఎన్నికల్లో పంజాబ్‌ ఎన్నికల ఫలితాలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తాయి. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు ఆధారంగా పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ తగు మెజారిటీతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, భగవంత్‌ మాన్‌ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అవుతారని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. సంచలన రాజకీయ మార్పుకు పంజాబ్‌ సిద్ధమైందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img