Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పంజాబ్‌ సీఎం చన్నీ రాజీనామా

చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ శుక్రవారం గవర్నర్‌ భన్వీరిలాల్‌ పురోహిత్‌కు తన రాజీనామా సమర్పించారు. ఆప్‌ అధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానున్న తరుణంలో చన్నీ నేతృత్వంలోని మంత్రివర్గాన్ని రద్దు చేసేలా వర్ట్యువల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 117 స్థానాలున్న అసెంబ్లీలో ఆప్‌ 92 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌ కేవలం 18 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. శిరోమణి అకాలీదళ్‌ మూడు సీట్లు గెలుచుకోగా, బీజేపీ రెండు, బీఎస్పీ 1 సీటు గెలుచుకున్నాయి. చన్నీ, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, అమరేందర్‌ సింగ్‌, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు వంటి ఉద్దండులు ఈ ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. చన్నీ పోటీ చేసిన రెండుస్థానాల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ‘కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిన అనంతరం, 15వ విధాన సభను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటాం’ అని చన్నీ విలేకరులకు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లారు. ‘నా రాజీనామాను గవర్నర్‌కు సమర్పించా. ప్రజల తీర్పును శిరసావహిస్తా. వారికి సేవ చేస్తూనే ఉంటాం’ అని చన్నీ పేర్కొన్నారు. 111 రోజుల పాలన ప్రజలకు నచ్చలేదా అన్న విలేకరుల ప్రశ్నకు చన్నీ మాట్లాడుతూ ఇసుక, పెట్రోలు ధరలు, విద్యుత్‌ బిల్లులు తగ్గించేలా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, ఆప్‌ అధ్వర్యంలో ఏర్పడబోతున్న ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img