Friday, April 19, 2024
Friday, April 19, 2024

పన్సారే కేసు ఏటీఎస్‌కి బదిలీ చేయాలి

మహారాష్ట్ర సీఐడీ దర్యాప్తులో పురోగతి లేదు
పన్సారే కోడలు మేఘా బొంబాయి హైకోర్టులో పిల్‌
రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసిన న్యాయస్థానం

ముంబై : సీపీఐ ప్రముఖ నాయకుడు గోవింద్‌ పన్సారే హత్యపై దర్యాప్తును మహారాష్ట్ర సీఐడీ నుంచి రాష్ట్ర ఏటీఎస్‌కి బదిలీ చేయాలని కోరుతూ పన్సారే కోడలు గురువారం బొంబాయి హైకోర్టులో మధ్యంతర దరఖాస్తును దాఖలు చేశారు. 2015 నుంచి ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదని, దర్యాప్తు స్థితి దయనీయంగా ఉందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2020 నుంచి ఇప్పటి వరకు సాధించిన పురోగతిని వివరించే నివేదికను సమర్పించాలని మహారాష్ట్ర పోలీసు నేర పరిశోధన విభాగం (సీఐడీ) ని ఆదేశించింది. పన్సారే, హేతువాది నరేంద్ర దభోల్కర్‌, కన్నడ విద్యావేత్త, ఉద్యమకారుడు ఎం.ఎం.కల్బుర్గి, జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యల వెనుక ‘పెద్ద కుట్ర’ ఉందని న్యాయవాది అభయ్‌ నెవాగి ద్వారా దాఖలు చేసిన తన పిటిషన్‌లో పన్సారే కోడలు మేఘా పన్సారే పేర్కొన్నారు. ‘లింక్‌, వారి వెనుక ఉన్న సూత్రధారి’ గురించి దర్యాప్తు చేయాలని న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, వి.జి.బిష్త్‌లతో కూడిన ధర్మాసనాన్ని నెవాగి అభ్యర్థించారు. అయితే దభోల్కర్‌ హత్య కేసు విచారణ ఇప్పటికే ప్రారంభమైనందున, ఆ దర్యాప్తును వేరే సంస్థకు బదిలీ చేయలేమని, హైకోర్టు ఆదేశాలను అనుసరించి పన్సారే కేసును యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) కి బదిలీ చేయవచ్చని న్యాయవాది వాదించారు. దభోల్కర్‌ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ చేస్తుండగా, మహారాష్ట్ర సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పన్సారే హత్యపై విచారణ జరుపుతోంది. కల్బుర్గి హత్య కేసును కర్ణాటక పోలీసు సీఐడీ విచారిస్తోంది. 2015 నుంచి పన్సారే కేసులో సీఐడీ ఎలాంటి పురోగతి సాధించలేదని, దర్యాప్తు పరిస్థితి దయనీయంగా ఉందని నెవాగి పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం రాష్ట్రానికి నోటీసులు జారీ చేసి స్పందన కోరింది. 2020 మధ్య కాలంలో చివరిగా స్థితి నివేదికను దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పుడు ఈ కేసులో సాధించిన పురోగతిని వివరిస్తూ స్థితి నివేదిక దాఖలు చేయాలని రాష్ట్ర సీఐడీని కోరింది. ధబోల్కర్‌ని 2013 ఆగస్టు 20న పూణేలో మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా కాల్చి చంపారు. పన్సారే పై ఫిబ్రవరి 16, 2015న కొల్హాపూర్‌లో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 20న మరణించాడు. కల్బుర్గిని కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఆగస్టు 30, 2015న కాల్చి చంపారు. ఈ మూడు కేసులను విచారి స్తున్న దర్యాప్తు సంస్థలు ఇంతకుముందు కోర్టులో ఈ కేసులకు కొన్ని సాధారణ లింకులు, నిందితులుగా ఉన్నారని పేర్కొన్నాయి. ఈ రెండు కేసులపై విచారణను కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ ధబోల్కర్‌, పన్సారే బంధువులు దాఖలు చేసిన పిటిషన్‌పై బొంబాయి హైకోర్టు విచారణ జరుపుతోంది. పన్సారే కేసులో ప్రస్తుత దర్యాప్తు అధికారి (ఐఓ) అదనపు ఎస్పీ తిరుపతి కాకడేను రిలీవ్‌ చేసేందుకు కూడా ధర్మాసనం గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. నాలుగున్నరేళ్లకు పైగా విచారణ చేపట్టిన తర్వాత కాకడే బదిలీ కావాల్సి ఉంది. ఈ రెండు కేసులను విచారిస్తున్న అధికారుల్లో ఎవరినీ కోర్టు అనుమతి లేకుండా మార్చరాదని బొంబాయి హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టును ఆశ్రయించింది. నాలుగు వారాల్లోగా కొత్త ఐవోని నియమించాలని, అప్పుడే కాకడే తన కొత్త పోస్టింగ్‌కు బాధ్యతలు చేపట్టగలరని పేర్కొంటూ కాకడేను రిలీవ్‌ చేయాలన్న రాష్ట్ర అభ్యర్థనను ధర్మాసనం అనుమతించింది. ఈ కేసును విచారణ చేస్తున్న సిట్‌లో 15 మంది అధికారులు ఉన్నారని, వీరిలో ఇద్దరు ఇటీవల పదవీ విరమణ పొందారని, ఒకరు కోవిడ్‌-19తో మరణించారని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img