Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పార్టీ ఏపని ఇచ్చినా సంతోషమే : సచిన్‌ పైలట్‌

న్యూదిల్లీ : రాజస్థాన్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాల నడుమ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సోనియాను కలిసిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది. సోనియా`పైలట్‌ మధ్య రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్లు తెలిసింది. సోనియాను కలిసిన అనంతరం పైలట్‌ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ పార్టీ నేను ఏది చేయాలనుకున్నానో అది చేయడం చాలా సంతోషంగా ఉంది. గత 20 ఏళ్లలో ఏ పని అప్పగించినా శ్రద్ధగా చేశా.. ఇప్పుడు నా పాత్ర ఏంటనేది పార్టీ నిర్ణయిస్తుంది.. ఏ పని అప్పగించినా సంతోషంగా చేస్తా’ అన్నారు. సోనియాజీ మా అందరి అభిప్రాయాలను తీసుకున్నందుకు సంతోషిస్తున్నా.. సరైన సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌ రాజస్థాన్‌ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను’ అని పైలట్‌ అన్నారు. కొద్ది రోజుల్లో రాజస్థాన్‌లో పెద్ద ఎత్తున మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో నియామకాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు ‘ఒకే వ్యక్తి, ఒకే పదవి’ ఫార్ములాను అనుసరించడం సహా వివిధ పద్ధతులు రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ జరగాలని, రాష్ట్రంలోని బోర్డులు, కార్పొరేషన్‌ పదవులకు నియామకాలు త్వరగా జరగాలని పైలట్‌ చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. పైలట్‌, అతనికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు గెహ్లాట్‌పై గత ఏడాది తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత పైలట్‌ను రాష్ట్ర పార్టీ చీఫ్‌, రాజస్థాన్‌ ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానం తొలగించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img