Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పిచ్చెక్కిందా… ఏమిటా తిక్క ప్రశ్నలు..?

జర్నలిస్టులపై అజయ్‌ మిశ్రా చిందులు
దుర్భాషలాడి.. మైక్‌ లాక్కున్న వైనం
లఖింపూర్‌లో ఘటన ` వీడియో వైరల్‌
న్యూదిల్లీ :
లఖింపూర్‌ ఖేరి హింస నేపథ్యంలో కేంద్రమంత్రి పదవి నుంచి అజయ్‌ మిశ్రా తొలగింపునకు డిమాండు మిన్నంటుతోంది. ఇలాంటి సమయంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విలేకరులు చుట్టుముట్టి జైల్లో ఉన్న తనయుడు ఆశీష్‌ మిశ్రా గురించి ప్రశ్నించారు. దీంతో ఆయన జర్నలిస్టులను తిట్టిపోశారు. పిచ్చెక్కిందా.. ఏమిటా తిక్క ప్రశ్నలు అంటూ విరుచుకుపడ్డారు. ఓ విలేకరిపైకి ఎగబడి మైక్‌ లాక్కున్నారు. ‘ఓరే మైక్‌ కట్టేయ్‌’ అంటూ అరిచారు. రిపోర్టర్లను దొంగలన్నారు. దుర్భాషలాడుతూ చిందులేశారు. లఖింపూర్‌ ఖేరిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి మంత్రి వెళ్లగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. రైతుల హత్యలు ఉద్దేశపూర్వమైనవే అని సిట్‌ నివేదిక పేర్కొనడంతో కొందరు విలేకరులు అజయ్‌ మిశ్రాను పలు ప్రశ్నలు అడిగారు. దీంతో ఆయన ఆగ్రహావేశానికి లోనయ్యారు. సిట్‌ నివేదికతో రాజకీయంగానూ పెను దుమారం రేగుతోంది. అజయ్‌ మిశ్రాపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర మంత్రిగా ఆయనను తొలగించాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలన్నీ డిమాండు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇదే విషయమై లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు మిశ్రాకు బీజేపీ అండగా నిలుస్తూ వచ్చింది. తనయుడి చేసిన నేరానికి తండ్రికి శిక్ష వేయడం తగదంటూ సమర్థించిందిగానీ త్వరలోనే ఉత్తరప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆయనను వెనకేసుకొని రావడం బీజేపీకి కష్టంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img