Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాగా భావించి.. సాధువులపై మూకదాడి

ఉత్తర భారతానికి చెందిన నలుగురు సాధువులు.. పలు పుణ్య క్షేత్రాలు, ఆలయాల దర్శనం కోసం బయలుదేరారు. దక్షిణాదిలోకి కర్ణాటకలో ఆలయాలను దర్శించుకుని మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పండరీపురానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వాహనంలో వెళ్తూ మార్గ మధ్యలో ఓ గ్రామం వద్ద బస చేశారు. ఈ క్రమంలో పండరీపురానికి వెళ్లే మార్గం గురించి అక్కడ కనిపించిన ఓ పిల్లాడ్ని ఆరా తీయడంతో వీళ్లు పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలని గ్రామస్థులు పొరబడి వారిపై కర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది. పండరీపురం పుణ్యక్షేత్రానికి కారులో వెళ్తున్న నలుగురు సాధువులపై మార్గమధ్యలో లవంగా గ్రామం వద్ద పిల్లలను ఎత్తుకుపోయిన ముఠాగా అనుమానించి కర్రలతో కొట్టారు. చివరకు పోలీసులకు సమాచారం తెలియడంతో అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్‌ మథురకు చెందిన నలుగురు సాధువులు దేశంలోని పలు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరారు. వీరు కర్ణాటకలోని బీజాపుర్కు వెళ్లి.. అక్కడి నుంచి మహారాష్ట్రలోని పండరీపుర క్షేత్రానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట మార్గమధ్యలో సాంగ్లీ జిల్లాలోని లవంగా గ్రామంలో ఓ ఆలయం వద్ద రాత్రికి బసచేశారు. మర్నాడు ఉదయం పండరీపురం వెళ్లడానికి లవంగా గ్రామానికి చెందిన ఓ బాలుడ్ని రహదారి గురించి సాధువులు ఆరా తీశారు.అయితే వీరిని పిల్లలు ఎత్తుకెళ్లే ముఠాగా అనుమానించిన గ్రామస్థులు పలు ప్రశ్నలు అడిగారు. ఇది క్రమంగా వాగ్వాదానికి దారితీయడంతో స్థానికులంతా కలిసి కర్రలతో దాడికి పాల్పడ్డారు. సాధువులపై దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సాధువులను స్టేషనుకు తరలించి సమగ్ర విచారణ చేపట్టగా వారు మథురలోని శ్రీ పంచనం జునా అఖాడాకు చెందిన సాధువులని గుర్తించారు. గ్రామస్థులు అపార్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని, ఉద్దేశపూర్వకంగా దాడిచేయలేదని పోలీసులకు సాధువులు వివరించారు. తాము కూడా అవగాహన లోపం వల్లే దాడి చేశామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img