Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పీకే మనకు అవసరమా?

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామా?
జీ`23 నేతల మంతనాలు
వేచిచూద్దామన్న కొంతమంది నేతలు
అసమ్మతినేతల కార్యకలాపాలు ముమ్మరం

న్యూదిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి నేతలుగా లేదా జీ23 బృందంగా ముద్రపడిన ఆ పార్టీ నేతలు తమ కార్యకలాపాలు ముమ్మరం చేశారు. పార్టీని పటిష్టవంతం చేయడమా లేదా తిరుగుబాటా తెలియదు కానీ ఆ బృందం ఎడతెరిపి లేకుండా మంతనాలు జరుపుతోంది. తాజాగా జన్మాష్టమి సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ నివాసంలో జీ23గా పిలువబడే 23 మంది అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. పార్టీ వ్యవహారాలు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ (పీకే)పార్టీలో చేరే అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఆ 23 మందిలోనే కొంతమంది ప్రశాంత్‌కిశోర్‌ చేరికను తీవ్రంగా వ్యతిరేకించారని, మరికొంతమంది మాత్రం వేచిచూసే విధానం అవలంబిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీని పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి 23 మంది సీనియర్‌ నేతలు లేఖ రాసి ఏడాది కాలమైంది. ఆ తర్వాత ఆ మొత్తం నాయకులు మళ్లీ సమావేశమై చర్చలు జరిపారు. కపిల్‌ సిబల్‌ ఇంట్లో సమావేశమైన వారిలో గులాం నబీ ఆజాద్‌, ఆనందశర్మ, మనీశ్‌ తివారీ, శశిథరూర్‌, ముకుల్‌ వాస్నిక్‌, వివేక్‌ టంఖా, భూపీందర్‌ హుడా తదితర నేతలు ఉన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ చేరికను సమర్థిస్తున్న నేతలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. చాలామంది నాయకులు వర్చువల్‌గా మాట్లాడారు. ‘పార్టీ ఔట్‌సోర్సింగ్‌ కింద మారిపోతుందేమోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చాలామంది తెలివిగల, నైపుణ్యం గల నాయకులు ఉన్నారు. ప్రశాంత్‌ రాకపై వేచిచూసే ధోరణి అవలంబించడం మంచిదని కొంతమంది సూచించారు’ అని జీ23 నేతల్లో ఒకరు చెప్పారు. వాస్తవంగా ఇది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీనే. జీ23 ఎంతమాత్రం కాదని ఆయన మీడియాతో అన్నారు. సీడబ్ల్యూసీ సభ్యుల అభిప్రాయం కూడా తీసుకుందామని సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, అంబికాసోనీ సూచించినట్లు తెలుస్తోంది. కొంతమంది సీడబ్ల్యూసీ సభ్యులతోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ప్రశాంత్‌ కిశోర్‌ను నేరుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సీబ్ల్యూసీ సభ్యునిగా తీసుకోవాలన్న భావనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘కాంగ్రెస్‌ పార్టీకి 135 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఫ్యాన్సీ ఆలోచనలతో ఏ ఒక్కరో వచ్చి ప్రారంభించింది కాదు. అలాంటి వాళ్లకు పార్టీని అప్పగించడం మంచిది కాదు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ లేదా ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వంటి నేతలు హవా లేకుండా కేవలం వ్యూహకర్తగా ప్రశాంత్‌కిశోర్‌ వల్లే ఆ పార్టీలు విజయం సాధించినట్లు మనం భావించాలా? ఆ నాయకుల కష్టం లేకుండా ప్రశాంత్‌ కిశోర్‌ వల్లే విజయాలు లభించలేదు. 2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ఎస్‌పీ కూటమికి పీకే వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో ఆయన సామర్ధ్యం ఏమిటో మనమంతా చూశాం’ అని మరో నాయకుడు వ్యాఖ్యానించారు. పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ సంక్షోభాన్ని పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటున్నది? కేరళ, అసోం, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి వంటి అంశాలపైనా జీ23 బృందం చర్చించింది. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సంబంధించిన నివేదికను సీడబ్ల్యూసీగానీ లేదా నాయకులు గానీ చర్చించారా లేదా తెలియదని, 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఏకే ఆంటోనీ నివేదికను సైతం పాతరేసి ఉంటారని మరో నాయకుడు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img