Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పెట్రో ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

అత్యవసర నిల్వల నుంచి
50 లక్షల బారెళ్ల ముడిచమురు విడుదలకు యోచన

న్యూదిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అత్యవసర నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల ముడిచమురును బయటకు తీసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రో ధరలను అదుపుచేసేందుకు అమెరికా, జపాన్‌ తదితర దేశాలు ఇటువంటి విధానాన్నే అనుసరిస్తున్నాయి. భారత్‌ తూర్పు, పశ్చిమ తీరంలోని మూడు ప్రదేశాలలో భూగర్భ గుహలలో నిల్వ చేసిన సుమారు 38 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేసింది. ఇందులో దాదాపు 5 మిలియన్‌ బ్యారెళ్లను 7-10 రోజులలోపు విడుదల చేయనున్నట్లు పేరు వెల్లడిరచని ఆ అధికారి పేర్కొన్నారు. అటువంటి ప్రయోజనాల కోసం భారత్‌ అత్యవసర చమురు నిల్వలను విడుదల చేయడం ఇదే మొదటిసారి. చమురు నిల్వలను మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పిఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్ప్‌ లిమిటెడ్‌ (హెచ్‌పిసిఎల్‌) లకు విక్రయిస్తారు. ఇవి పైప్‌లైన్‌ ద్వారా వ్యూహాత్మక నిల్వలకు అనుసంధానించబడ్డాయి. తర్వాత మరింత ముడి చమురును కూడా విడుదల చేసే అవకాశం ఉందని అధికారి తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న ధరల కట్టడి నిమిత్తం ఇప్పటికే అమెరికా, జపాన్‌ సహా పెద్ద దేశాలు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను
తగ్గించే సమన్వయ ప్రయత్నంలో భాగంగా అత్యవసర చమురు నిల్వలను విడుదల చేయాలని చైనా, భారత్‌, జపాన్‌తో సహా ప్రపంచంలోని అతిపెద్ద చమురు వినియోగ దేశాలలో కొన్నింటికి అమెరికా గత వారం అభ్యర్థించింది. వేగంగా తమ ఉత్పత్తిని పెంచేందుకు పదేపదే చేసిన అభ్యర్థనలను పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్‌) సభ్యులు, దాని మిత్రదేశాలు తిరస్కరించిన తర్వాత ఇది జరిగింది. భారత చమురు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ గత వారం దుబాయ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను అధిక ధరలు దెబ్బతీస్తాయని అన్నారు. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు , దిగుమతి చేసుకునే దేశం కూడా. అంతర్జాతీయంగా చమురు ధరల్లో నిరంతర పెరుగుదలతో తీవ్రంగా ప్రభావితమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img