Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రతి పురుషుడినీ రేపిస్ట్‌ అనలేం: స్మృతి ఇరానీ

న్యూదిల్లీ : ప్రతి పెళ్లినీ దౌర్జన్యపూరితమైనదిగా, ప్రతి పురుషుడినీ రేపిస్ట్‌గా విమర్శించడం సరైనది కాదని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. వైవాహిక అత్యాచారం (మారిటల్‌ రేప్‌)పై సీపీఐ నేత వినయ్‌ విశ్వం అడిగిన అనుబంధ ప్రశ్నకు సమాధానంగా బుధవారం ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ మహిళలు, బాలలను కాపాడటం అందరికీ ముఖ్యమైన విషయమేనని తెలిపారు. అయితే ప్రతి పెళ్లినీ, ప్రతి పురుషుడినీ విమర్శించాలని చెప్పడం సరైనది కాదన్నారు. వినయ్‌ విశ్వం అడిగిన అనుబంధ ప్రశ్నలో గృహ హింస నిర్వచనంపై గృహ హింస నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3ను, అదేవిధంగా అత్యాచారం (రేప్‌)పై ఐపీసీ సెక్షన్‌ 375ను ప్రభుత్వం పరిశీలించిందా? అనే అంశాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై స్మృతి ఇరానీ స్పందిస్తూ ‘ఈ దేశంలో ప్రతి పెళ్లినీ ఓ దౌర్జన్యపూరితమైన పెళ్లిగానూ, ఈ దేశంలోని ప్రతి పురుషుడినీ ఓ రేపిస్ట్‌గానూ ఈ గౌరవప్రదమైన సభలో విమర్శించడం సరైనది కాదు’ అని అన్నారు. ప్రస్తుతం న్యాయ విచారణలో ఉన్న అంశంపై వివరణాత్మకంగా మాట్లాడటానికి రాజ్యసభ నిబంధనావళిలోని రూల్‌ 47 ప్రకారం అనుమతి లేదని సీనియర్‌ సభ్యునికి తెలుసునన్నారు. రాష్ట్రాల సహకారంతో దేశంలోని మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 హెల్ప్‌లైన్స్‌ పని చేస్తున్నాయని, వీటి ద్వారా దాదాపు 66 లక్షల మంది మహిళలకు సహాయం అందిందని చెప్పారు. అదేవిధంగా 703 వన్‌ స్టాప్‌ సెంటర్ల ద్వారా 5 లక్షల మందికిపైగా మహిళలు సహాయం పొందారని తెలిపారు. ఇదిలావుండగా వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన అనేక పిటిషన్లపై దిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది. భార్యపై భర్త అత్యాచారం చేస్తే, భర్తను భారత శిక్షాస్మృతి ప్రకారం విచారించేందుకు అవకాశం లేదు. భర్తలకు ఇచ్చిన ఈ మినహాయింపును రద్దు చేయాలని ఈ పిటిషన్లు కోరుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img