Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రతి 36 మంది శిశువుల్లో తొలి పుట్టినరోజుకే ఒకరు మృతి

న్యూదిల్లీ : గత కొన్ని దశాబ్దాలుగా శిశు మరణాల రేటు క్షీణించినప్పటికీ, దేశంలో ప్రతి 36 మంది శిశువులలో ఒకరు మొదటి సంవత్సరంలోనే మరణిస్తున్నారని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌) ఒక దేశం లేదా ప్రాంతం మొత్తం ఆరోగ్య దృష్టాంత సూచికగా ఉంది. ఇది ఒక ప్రాంతానికి, నిర్ణీత వ్యవధిలో ప్రతి వెయ్యి సజీవ జననాలకు శిశు మరణాలు (ఒక సంవత్సరం కంటే తక్కువగా) నిర్వచించారు. భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ విడుదల చేసిన కొత్త గణాంకాల ప్రకారం, 1971 (వెయ్యి సజీవ జననాలకు 129 శిశు మరణాలు)తో పోలిస్తే ప్రస్తుత స్థాయి ఐఎంఆర్‌ (వెయ్యి సజీవ జననాలకు 28 శిశు మరణాలు, 2020 సంవత్సరానికి) నాలుగో వంతు కంటే తక్కువ. గత 10 సంవత్సరాలలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌) సుమారు 36 శాతం క్షీణించింది. గత దశాబ్దంలో అఖిల భారత స్థాయిలో ఐఎంఆర్‌ 44 నుంచి 28కి క్షీణించింది. ‘గ్రామీణ ప్రాంతాలలో సంబంధిత క్షీణత 48 నుంచి 31, పట్టణ ప్రాంతాలలో 29 నుంచి 19 వరకు ఉంది. తద్వారా వరుసగా 35 శాతం, 34 శాతం దశాబ్దాల క్షీణతను ప్రదర్శిస్తుంది’ అని పేర్కొంది. అయితే ‘గత కొన్ని దశాబ్దాలుగా ఐఎంఆర్‌ క్షీణించినప్పటికీ, జాతీయ స్థాయిలో (గ్రామీణ-పట్టణాలతో సంబంధం లేకుండా) ప్రతి 36 మంది శిశువులలో ఒకరు వారి జీవితంలో మొదటి సంవత్సరంలోనే మరణిస్తున్నారు’ అని వివరించింది. 2020లో మధ్యప్రదేశ్‌లో గరిష్ఠ ఐఎంఆర్‌ 43, మిజోరంలో కనిష్ఠంగా 3గా నివేదించింది. అఖిల భారత స్థాయిలో జననాల రేటు గత ఐదు దశాబ్దాలలో 1971లో 36.9 నుంచి 2020 నాటికి 19.5కి బాగా తగ్గింది. ఈ సంవత్సరాల్లో గ్రామీణ-పట్టణ వ్యత్యాసం కూడా తగ్గిపోయింది. అయితే గత ఐదు దశాబ్దాల్లో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో జననాల రేటు ఎక్కువగానే కొనసాగుతోంది. జననాల రేటు గత దశాబ్దంలో దాదాపు 11 శాతం క్షీణించింది. 2011లో 21.8 నుంచి 2020లో 19.5కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత తగ్గుదల 23.3 నుంచి 21.1 (సుమారు 9 శాతం క్షీణత), పట్టణ ప్రాంతాల్లో ఇది 17.6 నుంచి 16.1 శాతానికి (సుమారు 9 శాతం క్షీణత) ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img